3,949 సర్పంచి పదవులకు 25,985..
39,830 వార్డు సభ్యుల పదవులకు 92,129 నామినేషన్లు
మొదటివిడత గ్రామాల్లో మంగళవారమే ముగిసిన ప్రక్రియ
ఘర్షణలు ఎక్కువగా జరిగిన అన్నమయ్య జిల్లాలో అత్యల్పంగా నామినేషన్లు
రెండో విడత ఎన్నికలు జరిగే 4,975 గ్రామాల్లో నామినేషన్లు మొదలు
ఏకగ్రీవాలైన చోట ఫలితం ప్రకటించిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరుగుతున్న 3,949 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యుల పదవులకు మొత్తం 1,18,114 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 201 మండలాల పరిధిలో 3,951 గ్రామ పంచాయతీల్లో ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండల పరిధిలో ఓటర్ల జాబితాలు తారుమారయ్యాయని కొందరు కోర్టుకు వెళ్లడంతో అక్కడ తిరిగి మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ రెండు గ్రామ పంచాయతీలు మినహా మిగిలిన 3,949 గ్రామ పంచాయతీల్లోనే నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
వీటికి మంగళవారం సాయంత్రమే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ గ్రామాల్లో సర్పంచ్ పదవులకు మొత్తం 25,985 నామినేషన్లు.. అలాగే, 39,830 వార్డు సభ్యుల పదవులకు 92,129 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషన్ తెలిపింది. ఆయా గ్రామ పంచాయతీల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. ఈనెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అయితే, ఘర్షణలు ఎక్కువగా చోటుచేసుకున్న అన్నమయ్య జిల్లాలో మొత్తం 85 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు అత్యల్పంగా సరాసరి నాలుగు కన్నా తక్కువగా కేవలం 329 నామినేషన్లే దాఖలయ్యాయి.
రెండో విడతలో 4,975 గ్రామాల్లో నామినేషన్లు..
ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 246 మండలాల్లో బుధవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రిటర్నింగ్ అధికారులు ఉ.10.30కు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసి నామినేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏకగ్రీవాలైన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక: ఎస్‌ఈసీ
ఇక సర్పంచ్, వార్డు సభ్యులందరూ ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఫలితాలు ప్రకటించిన వెంటనే అదేరోజున ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఈ అంశంపై కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి వివరణ కోరడంతో ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
రిటర్నింగ్ అధికారులకు తగిన సూచనలు జారీచేయాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు సూచించారు. నిజానికి.. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు జరిగే రోజే ఉపసర్పంచ్ ఎన్నిక జరగాలని ఉంటుంది. ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ముందుగా నిర్ణయించిన తేదీ వరకు వేచి ఉండకుండా, ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలనే ఉద్దేశంతోనే ఈ మార్గదర్శకాలను జారీచేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.


