తాడేపల్లి: జనసేన కార్యాలయం కేంద్రంగా రూ.7 కోట్లకు పైగా ఉద్యోగాల కుంభకోణం జరిగిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆరోపించారు. 14 నెలలుగా వ్యవహారం సాగితే.. మూడు రోజుల్లోనే ఉద్యోగి తొలగింపు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వసూలైన డబ్బు ఎక్కడికి వెళ్లిందని నిలదీశారు.
తాడేపల్లిలో ఆరె శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రూ.7.5 కోట్లు వసూలయ్యాయని చెబుతున్నారు.. ఆ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తేల్చరా? 36 ఉద్యోగాలకు అధికారిక ముద్రలు, ఈ-మెయిల్స్, ఐడీ కార్డులు వాడితే బాధ్యత ఎవరిది? జనసేన పార్టీ కార్యాలయంలో ప్రైవేట్ కంపెనీ కార్యకలాపాలు ఎలా సాగాయి?
కోట రుక్మిణి, కంపెనీ యాజమాన్యం, ఇతరుల పాత్రపై సమగ్ర విచారణ ఎప్పుడు? రూ.8 లక్షలు, రూ.9 లక్షల లావాదేవీల వివరాలు బయటపెడితే.. డబ్బు జాడను పోలీసులు గుర్తించారా? పెద్దిరాజుకు రూ.1.49 కోట్ల నష్టం జరిగితే.. ఆ డబ్బు ఎవరి చేతికి వెళ్లింది? కంపెనీ ఖాతాల నుంచి వ్యక్తిగత ఖాతాల వరకు ప్రతి లావాదేవీని బయటపెట్టాలి. సిట్ పేరుతో కేసును చుట్టేయొద్దు.. కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలి. సీబీఐ దర్యాప్తుతో ఉద్యోగాల కుంభకోణం వెనుక ఉన్న అసలు దొంగలను బయటకు తీయాలి. బాధితులు చెమటోడ్చి సంపాదించిన డబ్బు తిరిగి ఇచ్చే వరకు ఈ కేసును వదిలేది లేదు’’ అని తెలిపారు.


