లోకేష్‌పై కొడాలి నాని ఆగ్రహం | Kodali Nani Slams On Nara Lokesh and Chandrababu | Sakshi
Sakshi News home page

లోకేష్‌పై కొడాలి నాని ఆగ్రహం

Nov 18 2026 4:59 PM | Updated on Nov 18 2026 5:15 PM

Kodali Nani Slams On Nara Lokesh and Chandrababu

సాక్షి,గుడివాడ: విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.9,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిల గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నిస్తే, మంత్రి నారా లోకేష్‌ ఇప్పటికే చెల్లించామని పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. బకాయిలను చెల్లించకుండా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, దీంతో పేద విద్యార్థులు చదువులు కొనసాగించలేక మధ్యలోనే విద్యకు దూరమయ్యే దుస్థితి ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు.

గుడివాడలో ఆయన మాట్లాడిన వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థులకు అందాల్సిన విద్యాదీవెన, ఏడాదికి ఒకసారి వసతిదీవెన నిధులను క్రమం తప్పకుండా విడుదల చేశామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ కారణంగా చివరి త్రైమాసికానికి సంబంధించిన బకాయిలు మాత్రమే మిగిలాయని, అంతేకాకుండా గతంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం వదిలివెళ్లిన సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలను సైతం జగన్‌ ప్రభుత్వమే చెల్లించిందని గుర్తు చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వైఎస్‌  జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు.

వైఎస్‌ భారతిని తిడితే ఎందుకు ఖండించడం లేదు?
సోషల్‌ మీడియా వేదికగా జనసేనకు చెందిన సైకోలు  వైఎస్‌ జగన్‌  కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా వైఎస్‌ భారతిపై అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దాడులకు దిగుతుంటే చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదు? తన భార్యను అవమానించారని గతంలో గుక్కపట్టి ఏడ్చిన చంద్రబాబు, తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్‌.. నేడు వైఎస్‌ భారతిపై ఇంతటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మహిళలపై జరిగే అవమానాలను రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన బాధ్యత లేదా? జనసేనకు చెందిన వ్యక్తులు చేస్తున్న ఈ నీచమైన వ్యాఖ్యలను కూటమి నాయకులు ఎందుకు ఖండించడం లేదు? వారి మౌనం వారి రాజకీయ సంస్కారాన్ని తెలియజేస్తోంది.

ఎన్నికల స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని ఇప్పటికే అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రాయలసీమ నుంచి పల్నాడు వరకు సుమారు 17 మున్సిపాలిటీల్లో, అనేక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడ్డారు. డబ్బు, మద్యం, బెదిరింపులు, రిగ్గింగ్‌తో పాటు వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్లను సైతం లోపలికి అనుమతించకుండా ప్రజాతీర్పును అపహాస్యం చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులపై దాడులు చేస్తూ బలవంతపు ఏకగ్రీవాలకు కుట్ర చేస్తున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీ 40కి పైగా మున్సిపాలిటీలు, సుమారు 12 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్థానాలతో పాటు అనేక మండల పరిషత్‌ స్థానాలను గెలుచుకునేది. ప్రజాబలంతో గెలవలేక అధికార బలం, ధనబలం, పోలీసు బలంతో స్థానాలను చేజిక్కించుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఈ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌ ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని కొడాలి నాని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement