నాడు నిప్పులు.. నేడు ఆత్మీయ పలకరింపులు? | Congress Leaders And Netizens Ask Sharmila And Party Status In AP | Sakshi
Sakshi News home page

నాడు నిప్పులు.. నేడు ఆత్మీయ పలకరింపులు?

Nov 18 2026 2:16 PM | Updated on Nov 18 2026 2:23 PM

Congress Leaders And Netizens Ask Sharmila And Party Status In AP

సాక్షి, తాడేపల్లి: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వైఎస్‌ షర్మిల.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పొలిటికల్‌గా సన్నిహితంగా మెలగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తూనే.. మరోవైపు టీడీపీ అధినేతతో తరచూ భేటీలు, సంప్రదింపులు ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబును గతంలో తీవ్రంగా విమర్శించిన షర్మిల.. ఇప్పుడు ఆయనను పదేపదే కలుస్తుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం వ్యక్తిగత మర్యాదకే పరిమితమా? లేక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా? అన్న చర్చ మొదలైంది.

నవంబర్‌ 15న షర్మిల చంద్రబాబును కలిసి తన కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేసి వేడుకకు హాజరుకావాలని కోరారు. ఈ భేటీని కుటుంబ వేడుకకు ఆహ్వానంగా మాత్రమే చూడాలని షర్మిల వర్గం చెబుతోంది. తన కుమార్తె వివాహానికి వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్న క్రమంలోనే చంద్రబాబును కూడా కలిశారు. అయితే, రాజకీయంగా భిన్నమైన పార్టీలకు చెందిన నేతల మధ్య ఈ భేటీ జరగడంతో రాజకీయ చర్చ మొదలైంది. కానీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె రాజకీయ వైఖరిపై ప్రశ్నలు తలెత్తడం మాత్రం సహజమే.

గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. 
గతంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చలోకి వస్తున్నాయి. ‘కుట్రల బాబు’ అంటూ ఆమె గతంలో చేసిన విమర్శలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని కూడా షర్మిల గతంలో తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో బీజేపీతో టీడీపీ పొత్తును ప్రశ్నించారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న నాయకురాలు ఇప్పుడు చంద్రబాబును కలవడం, ఆయనతో సాన్నిహిత్యంగా కనిపించడం చర్చకు కారణమవుతోంది. అయితే, రాజకీయ విమర్శలు ఒక అంశమైతే.. కుటుంబ శుభకార్యానికి ఆహ్వానించడం మరో అంశం. ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థి పార్టీ నేతను వ్యక్తిగత కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని మాత్రమే రాజకీయ సాన్నిహిత్యంగా పరిగణించలేం. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల.. చంద్రబాబు ప్రభుత్వంపై ఏ స్థాయిలో పోరాడుతున్నారు? ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌ తరఫున ఎంత బలంగా గళమెత్తుతున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సర్కార్‌ను ప్రశ్నించరా?
2024 ఎన్నికల సమయంలో షర్మిల ప్రధానంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కానీ, అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రశ్నించలేకపోయారు. హామీల(సూపర్‌ సిక్స్‌ హామీలు) విషయంలోనూ ఇదే వైఖరి కొనసాగిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందా? అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఇదే సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమిపై కాంగ్రెస్‌ విమర్శలు, పోరాటాలు కూడా పార్టీ రాజకీయ గుర్తింపును నిర్ణయించనున్నాయి.

ఇదీ చదవండి: షర్మిల పోస్టుపై లోకేష్‌ పూనకాలు.. నెటిజన్ల కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement