66 ఏళ్ల లీజు ఎందుకు?.. కూటమి సర్కార్‌కు పేర్ని నాని హెచ్చరిక | Perni Nani Serious Comments On Chandrababu Over Medical Colleges | Sakshi
Sakshi News home page

66 ఏళ్ల లీజు ఎందుకు?.. కూటమి సర్కార్‌కు పేర్ని నాని హెచ్చరిక

Nov 18 2026 1:14 PM | Updated on Nov 18 2026 1:21 PM

Perni Nani Serious Comments On Chandrababu Over Medical Colleges

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని, లేదంటే ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం చూస్తోందని, నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ కలిసి కూటమి కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో తమదే అధికారం అంటూ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాజ హితం కోరే పలువురు అభ్యంతరం చెబుతున్నా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం ఆపడం లేదని మండిపడ్డారు.

66 ఏళ్ల లీజు ఎందుకు?
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను 66 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికి ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో తెలియని పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘ కాలానికి ప్రజల ఆస్తులను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) ఇస్తామని చెబుతున్నారని, రెండేళ్ల పాటు జీతాలు కూడా ఇస్తామని అంటున్నారని పేర్కొన్నారు. అయితే, మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి, నిర్వహణకు అవసరమైన ప్రజాధనాన్ని ఎవరు సమకూరుస్తారని నిలదీశారు. చంద్రబాబు హెరిటేజ్‌ సొమ్ము ఇస్తారా? పవన్‌ కల్యాణ్‌ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ఇస్తారా? లేక ప్రధాని మోదీ, అమిత్‌ షా, మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తమ జేబుల్లోంచి నిధులు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనే సీట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, లక్షల రూపాయలు వసూలు చేసే నారాయణ, చైతన్య విద్యాసంస్థలను నియంత్రించలేని ప్రభుత్వం.. ప్రభుత్వ కాలేజీల్లో సగం సీట్లను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఎలా పర్యవేక్షిస్తుందని ప్రశ్నించారు.

పేదలకు వైద్యం అవసరం లేదా?
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని నాని ఆరోపించారు. ఎమ్మెల్యేల సిఫార్సులు ఉంటే తప్ప పేదలకు అరకొర వైద్యం కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, సత్యకుమార్‌ యాదవ్‌కు అనారోగ్యం వస్తే హెలికాప్టర్లలో హైదరాబాద్‌కు వెళ్తారని, పవన్‌ కల్యాణ్‌కు ఏదైనా సమస్య వస్తే ముంబైకి వెళ్తారని వ్యాఖ్యానించారు. మరి పేద ప్రజలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను గతంలో వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేశారని.. ఇప్పుడు రూ.1,500 కోట్లతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. విగ్రహాల కోసం ఖర్చు చేసే నిధులతో మెడికల్‌ కాలేజీలు నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులు, బినామీలకు అప్పగించి దోచుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇదీ చదవండి: షర్మిల పోస్టుపై లోకేష్‌ పూనకాలు.. నెటిజన్ల కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement