పక్కనే ఉన్న వెంచర్‌కు తీసుకెళ్లి.. దారుణం | Tirupati Bhagyasree Incident | Sakshi
Sakshi News home page

పక్కనే ఉన్న వెంచర్‌కు తీసుకెళ్లి.. దారుణం

Nov 18 2026 12:08 PM | Updated on Nov 18 2026 12:10 PM

Tirupati Bhagyasree Incident

తిరుపతి రూరల్‌: అనుమానంతోనే తన ప్రియురాలుని బండరాయితో మోది హతమార్చిన హంతకుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. వివరాలు.. తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సి.మల్లవరం గ్రామ సమీపంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో అక్టోబర్‌ 31న గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఆధారాలు లభించకపోవడం, మృతురాలి వివరాలు తెలియకపోవడంతో కేసు దర్యాప్తు సవాలుగా మారింది. మృతదేహం ఫొటోలు, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా మృతురాలు చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన భాగ్యశ్రీగా ఆమె తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. భాగ్యశ్రీ ఓ బ్యాంక్‌కు సంబంధించిన క్రెడిట్‌ కార్డు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు.  

కాల్‌ డేటాతో అరెస్ట్‌ 
తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగి్నషన్‌(ఏఎన్‌పీఆర్‌) కెమెరాల ద్వారా అనుమానిత వాహనాల కదలికలను విశ్లేషించారు. కాల్‌ డేటా రికార్డులు (సీడీఆర్‌), మొబైల్‌ టవర్‌ లొకేషన్ల ఆధారంగా మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. ఈ క్రమంలో అన్ని ఆధారాలు పరిశీలించిన తరువాత షేక్‌ జమాలుల్లా బాషా అలియాస్‌ జమీల్‌ బాషా (38) హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. 

అప్పటికే నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. ఈనెల 16న సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా, రొంపిచెర్ల క్రాస్‌ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన ఆటో, రెండు సెల్‌ఫోన్లు, రూ.450 నగదును అతని వద్ద నుంచి స్వా«దీనం చేసుకున్నట్టు సీఐ మద్దయ్యాచారి తెలిపారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

అనుమానమే హత్యకు కారణం 
భాగ్యశ్రీ, జమీల్‌ బాషా ఇద్దరూ రొంపిచెర్లకు చెందినవారు. సమీప గృహాల్లో నివాసం ఉండడంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే తిరుపతిలోని క్రెడిట్‌ కార్డు కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న భాగ్యశ్రీ సహచర ఉద్యోగులతో సన్నిహితంగా ఉండడాన్ని జమీల్‌ బాషా జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆమెను పలు మార్లు హెచ్చరించాడు. ఆ తరువాత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటిలాగానే తన ఆటోలో ఆమెను ఎక్కించుకుని సి.మల్లవరం జంక్షన్‌ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న వెంచర్‌కు తీసుకెళ్లాడు. 

అక్కడ కొంత సేపు ఇద్దరూ గొడవపడగా ఆ వెంటనే బండరాయితో భాగ్యశ్రీ తలపై మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా ఎలాంటి ఆధారాలు లేని హత్య కేసును 17 రోజుల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్‌ చేసిన తిరుపతి రూరల్‌ పోలీసులను జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు, అడిషనల్‌ ఎస్పీ రవిమనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ పి.జగదీష్‌ నాయక్‌ అభినందించారు. 

ఇదీ చదవండి: భాగ్యశ్రీని బండరాయితో మోది.. కిరాతకంగా హత్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement