ఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, తయారీ రంగం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం లేదని, విద్యావ్యవస్థలోనూ లోతైన సమస్యలు ఉన్నాయని విమర్శించారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై బీజేపీ మండిపడింది. విదేశీ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
కొలంబియా యూనివర్సిటీలో రాహుల్ మాట్లాడుతూ.. భారత్ ప్రస్తుతం ఆర్థిక విపత్తును ఎదుర్కొంటోందని అన్నారు. ఈ వాస్తవాన్ని కొందరు పట్టించుకోకపోవచ్చని, మీడియా కూడా పక్కన పెట్టవచ్చు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, విద్యావ్యవస్థలోనూ అనేక లోపాలున్నాయని పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితమే భారత ఆర్థిక నమూనా ఆశించిన ఫలితాలను ఇవ్వడం ఆగిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు కూడా తగినన్ని ఉద్యోగాలను సృష్టించలేకపోయాయని విమర్శించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివని.. ప్రస్తుతం ఆ వెన్నెముక బలహీనపడిందని వ్యాఖ్యానించారు.
A grand welcome for @RahulGandhi ji at Columbia University, USA. A voice that carries India's democratic values, diversity and vision to the global stage. 🇮🇳 https://t.co/Stg8roKQ0t
— Harish Srinivasa (@hawee72) November 18, 2026
అదానీ, అంబానీల పేర్లతో విమర్శలు
దేశంలో సేవల రంగం ఒక్కటే అందరికీ ఉద్యోగాలు కల్పించలేదని రాహుల్ అభిప్రాయపడ్డారు. భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తయారీ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. అదానీ, అంబానీ వంటి కొద్దిమంది పారిశ్రామికవేత్తల వ్యాపారాలే ఎందుకు విస్తరిస్తున్నాయని నిలదీశారు. టాటా గ్రూప్ కూడా అదానీ చేతుల్లోకి వెళ్తోందంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ ఆగ్రహం..
విదేశీ విశ్వవిద్యాలయాల్లో రాహుల్ గాంధీ చేసే ప్రసంగాలు గతంలోనూ రాజకీయ వివాదాలకు కారణమయ్యాయి. తాజాగా కొలంబియా యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశీ గడ్డపై దేశ ఆర్థిక వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారని, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. దీంతో అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధానికి తెరతీశాయి.
ఇదీ చదవండి: కశ్మీర్‌లో హైటెన్షన్.. లతీఫ్‌తో సైన్యం వీడియో కాల్


