ఈసీకి కూటమి 48 ప్రశ్నలు..!  | INDIA bloc seeks Supreme Court nod to ask ECI 48 questions on SIR | Sakshi
Sakshi News home page

ఈసీకి కూటమి 48 ప్రశ్నలు..! 

Nov 17 2026 5:28 AM | Updated on Nov 17 2026 5:28 AM

INDIA bloc seeks Supreme Court nod to ask ECI 48 questions on SIR

ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించేందుకు అనుమతివ్వండి 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్, ఇండియా కూటమి 

దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల తొలగింపు అక్రమం 

సర్‌ ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలంటూ పిటిషనర్ల ఆరోపణ

సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీ, ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులైన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషీలను లిఖితపూర్వకంగా ప్రశ్నించేందుకు అనుమతించాలంటూ అఫిడవిట్‌ వేశారు.

 సీఈసీ, ఇతర ఈసీలతోపాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ జనరల్‌ను అడగాలనుకుంటున్న 48 ప్రశ్నల జాబితాను అందులో పొందుపరిచారు. ఈ ప్రశ్నల జాబితాను ప్రతివాదులకు అందజేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రతివాదులు తమ గుర్తింపుతో అఫిడవిట్‌ రూపంలో వాటికి సమాధానం ఇచ్చేలా ఆదేశాలివ్వాలన్నారు. అలాగే, సమాధానాలకు సంబంధించిన రికార్డుల ప్రతులను కూడా జత చేయాలన్నారు. 

అధికారిక రహస్యాల రక్షణ గురించిన అంశాలేవైనా ఉంటే వాటికి సంబంధించిన కారణాలను స్పష్టంగా పేర్కొనాలని పిటిషనర్లు కోరారు. కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, టీఎంసీ నుంచి సౌగతా రాయ్, ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్‌ రౌత్, ఎన్‌సీపీ(ఎస్‌పీ) నేత సుప్రియా సూలే, వామపక్షాల నేతలు ఎంఏ బేబీ, డి.రాజా తదితరులు సహ పిటిషనర్లుగా ఉన్నారు. 

జ్ఞానేశ్‌ ఒంటెద్దు పోకడలు 
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సి ఉండగా, సర్‌ అమలు విషయంలో మాత్రం సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఒంటరిగా నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ప్రధానంగా ఆరోపించారు. గత పది నెలల కాలంలో కనీసం 14 సందర్భాల్లో ఇద్దరు ఈసీలు సీఈసీ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫైళ్లపై సంతకాలు చేశారంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ఉదహరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణ బాధ్యత ఈసీకి ఉంటుంది. 

1995 నాటి టీఎన్‌ శేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇతర కమిషనర్ల కంటే సీఈసీకి అదనంగా ఎలాంటి అధికారాలు లేవు. అలాగే, ఎన్నికల కమిషనర్ల చట్టం–2023లోని సెక్షన్‌ 18 ప్రకారం ఈసీ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రాతిపదికన తీసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి సీఈసీ ఏకపక్షంగా వ్యవహరించారని రాహుల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఈసీ చెబుతున్నప్పటికీ, ఆ రికార్డులను బయటపెడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. 

13 కోట్ల పేర్ల తొలగింపు ఆందోళనకరం 
ఓటరు జాబితా సర్‌ ప్రక్రియలో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లను తొలగించారని పిటిషనర్లు ఆరోపించారు. 1995 నాటి లాల్‌ బాబు హుస్సేన్‌ కేసు తీర్పు ప్రకారం ముందుగా నోటీసు ఇవ్వకుండా, సంబం«దీకుల వాదనలు వినకుండా ఓట్లను తొలగించడం చట్టవిరుద్ధం. సర్‌ ప్రక్రియలో ఈ నిబంధనలు పాటించలేదని, నోటీసులు లేకుండానే ఓట్లు మాయమయ్యాయని తెలిపారు. ముసాయిదా దశలోనే వలస వెళ్లిన, చనిపోయిన, నకిలీ ఓటర్లను మాత్రమే తొలగించామని, ఆ 13 కోట్ల సంఖ్య తుది తొలగింపులది కాదని ఈసీ వాదిస్తోందన్నారు. 

నిబంధనల మార్పు అనుమానాస్పదం 
జాతీయ స్థాయిలో సర్‌ ప్రక్రియను ప్రారంభించే విషయంలో ఈసీ దగ్గర సరైన సమాచారం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. 2025 జూలైలో దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానమిస్తూ, సర్‌పై ఈసీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని సమాచార అధికారి తెలపడాన్ని వారు ప్రస్తావించారు. సెపె్టంబర్‌ 26న విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తమ నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం ఉందని ఈసీ తెలపడం విరుద్ధంగా ఉందని ఎత్తిచూపారు. కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఆన్‌లైన్‌ ఫారం–6ను 1960 నిబంధనలను సవరించకుండానే జూలైలో మార్చేశారని ఆరోపించారు. 

ఈసీ వినియోగిస్తున్న ఈసీఐనెట్, ఈఆర్‌ఓనెట్‌ డేటాబేస్‌లకు ఎలాంటి స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించలేదని స్పష్టం చేశారు. సాంకేతిక లోపం వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతైతే, వాటిని తిరిగి జాబితాలో చేర్చేందుకు రోల్‌ బ్యాక్‌ సదుపాయం ఆ సాఫ్ట్‌వేర్‌లో లేకపోవడం తీవ్ర అభ్యంతరకరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకత, ఓటర్ల జాబితా స్వచ్ఛతపై రాహుల్‌ లేవనెత్తిన ఈ 48 ప్రశ్నల విషయంలో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement