వాస్తవాలను ప్రపంచానికి చెప్పాలనే! | Sonia Gandhi Autobiography Belonging | Sakshi
Sakshi News home page

వాస్తవాలను ప్రపంచానికి చెప్పాలనే!

Nov 17 2026 4:42 AM | Updated on Nov 17 2026 4:42 AM

Sonia Gandhi Autobiography Belonging

‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు

నా కుటుంబం గురించి కల్పిత కథనాల ప్రచారం

వాటికి తెరదించడానికే ఆత్మకథ రాశాను..

బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకావిష్కరణలో సోనియా గాంధీ

తన తల్లిదండ్రుల ప్రేమకథను ప్రస్తావించిన రాహుల్‌

ఇందిర, రాజీవ్‌ మరణం వంటి బాధాకర జ్ఞాపకాలతో భావోద్వేగం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తన గురించి, తన కుటుంబం గురించి ఇన్నాళ్లూ అనేక కల్పిత కథనాలు, అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయని, అసలు వాస్తవాలను తన కోణంలో ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆత్మకథ రాశానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సోనియా గాంధీ స్పష్టం చేశారు. తన విదేశీ మూలాలపై వచ్చిన రాజకీయ విమర్శలను ప్రస్తావిస్తూ, తాను మనసా వాచా కర్మణా భారతీయురాలినని అన్నారు. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో సోనియా గాంధీ తన జీవితంలోని ఆటుపోట్లు, కీలక నిర్ణయాల వెనుక ఉన్న అసలు వాస్తవాలను ఆహూతులతో పంచుకున్నారు. ఈ మట్టితో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెబుతూ భావోద్వేగభరితులయ్యారు. ఒక భారతీయ కోడలిలాగే తాను కూడా తన కొత్త కుటుంబాన్ని, ఇక్కడి సంస్కృతిని, చీరకట్టును ఎంతో ఇష్టంతో అలవాటు చేసుకున్నానని అన్నారు. తన అత్తగారు ఇందిరా గాంధీ కేవలం ఒక ప్రధానమంత్రిగానే కాకుండా, తనకు ఒక మార్గదర్శిగా, తల్లిలా అండగా నిలిచారని చెప్పారు. రాజీవ్‌ గాంధీతో తన అనుబంధాన్ని ఎంతో ప్రేమగా గుర్తు చేసుకున్నారు. తమది మ్యాజికల్‌ అనుబంధమన్నారు.

పుస్తకం ఎందుకు రాశానంటే..
ఆత్మకథ ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరిస్తూ.. మొదట్లో తనకు ఆ ఆలోచన లేదని, లోలోపలి భావాలను వెల్లడించడం నిజానికి తనకు ఇష్టం లేదని తెలిపారు. అయితే, ‘నువ్వు పుస్తకం రాయాల్సిందేనని నా మిత్రులు చాలాసార్లు అడిగారు. అలాగే, రాహుల్, ప్రియాంక కూడా పట్టుబట్టారు. దాంతో ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు. తనపై, తన కుటుంబంపై వస్తున్న అనేక అవాస్తవాలు, కట్టుకథలకు సమాధానం చెప్పాలన్న ఉద్దేశ్యం కూడా ఉందన్నారు.

ప్రధాని పదవిపై..
2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించారనే అంశంపై మాట్లాడుతూ, అది పూర్తిగా తన అంతరాత్మ ప్రబోధం మేరకు తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఆ సమయంలో తన పిల్లల భద్రత, దేశ ఐక్యత దృష్ట్యా మన్మోహన్‌ సింగ్‌ ఆ బాధ్యతకు అత్యంత అర్హుడని భావించానని వివరించారు. తనకు రాజకీయాలపై ఏనాడూ ఆసక్తి లేదని, రాజీవ్‌ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ, తన భర్త, అత్తగారి వారసత్వాన్ని కాపాడుకోవడానికే తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని సోనియా వెల్లడించారు.

వారిద్దరు ఒకరికి ఒకరు..
అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ తల్లిదండ్రులతో తనకు, తన  సోదరి ప్రియాంకకు ఉన్న అనుబంధాన్ని  వివరించారు. తన తల్లిదండ్రులు ఒకరి కోసం మరొకరు అన్నంత అన్యోన్యంగా ఉండేవారన్నారు. ప్రతి రోజు భోజన సమయంలో తన తల్లి సోనియా, తండ్రి రాజీవ్‌ ఒడిలో కూర్చునేవారని చెప్పారు. చిన్నతనంలో ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందని తాను భావించేవాడినని, ఒకసారి తన స్నేహితుడిని ‘మీ అమ్మ మీ నాన్న ఒడిలో ఎందుకు కూర్చోదు?’ అని అమాయకంగా అడిగానని చెప్పడంతో సభంతా నవ్వులు విరబూశాయి.

ఆ ఒక్క గొడవ...
తాను, తన సోదరి ప్రియాంక తమ తల్లిదండ్రులు గొడవపడటాన్ని జీవితంలో ఒకే ఒక్కసారి చూశామని, దానికి ఈ సభలో ఉన్న పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఫోన్‌ కాల్‌ కారణమని రాహుల్‌ సరదాగా చెప్పారు. ఒకసారి రాజీవ్‌ గాంధీ అమరీందర్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో సోనియా గాంధీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి రాజీవ్‌ను మూడు నాలుగు సార్లు పిలిచారని గుర్తుచేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగిందని అన్నారు.

గర్ల్‌ ఫ్రెండ్‌తో ‘కేంబ్రిడ్జ్‌’ రెస్టారెంట్‌కు వెళ్లా...
తన తల్లిదండ్రులు 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లోనున్న ‘వర్సిటీ’ అనే గ్రీక్‌ రెస్టారెంట్‌లో తొలిసారి కలుసుకున్నారని రాహుల్‌ గుర్తుచేసుకున్నారు. తాను కూడా కేంబ్రిడ్జ్‌లో చదువుకునే రోజుల్లో, ఆ ప్రదేశాన్ని చూడాలనే ఆసక్తితో తన అప్పటి గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లానని వెల్లడించారు. ఆ రెస్టారెంట్‌ గోడపై తన తల్లిదండ్రుల ఫొటో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ‘నా తల్లిదండ్రులు ఇక్కడే తొలిసారి కలుసుకున్నారు’ అని ఆ రెస్టారెంట్‌ యజమానికి చెప్పగా ఆయన ఎంతో సంతోషించారని అన్నారు.

ఆస్పత్రి కారిడార్‌లో రక్తపు మరకలు..
సరదా ముచ్చట్ల తర్వాత రాహుల్‌ గాంధీ తమ కుటుంబం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన, బాధాకరమైన ఘట్టాలను కూడా గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 1984 అక్టోబర్‌ 31న ఇందిరా గాంధీపై కాల్పులు జరిగిన వెంటనే, ఆమెను కారులో ఆస్పత్రికి తరలించేటప్పుడు సోనియా గాంధీ ఆమె తలను తన ఒడిలో పెట్టుకున్నారని చెప్పారు. ఆస్పత్రి కారిడార్‌లో తన తల్లి దుస్తుల నిండా నానమ్మ రక్తం అంటి ఉండటాన్ని తాను చూసిన ఆ భయానక దృశ్యం ఇప్పటికీ కళ్లముందే ఉందని అన్నారు. 1991 మే 21న శ్రీపెరంబదూర్‌లో రాజీవ్‌ గాంధీ హత్యకు గురైనప్పుడు, ఏడేళ్ల వ్యవధిలో రెండో ఘోర విషాదంతో తమ ప్రపంచమే కుప్పకూలిందని రాహుల్‌ చెప్పారు.

కేన్సర్‌ కష్టకాలం
సోనియా గాంధీ కేన్సర్‌ బారిన పడిన కఠిన సమయాన్ని కూడా రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన రోజుల్లో ఆమె అనుభవించిన తీవ్ర శారీరక వేదనను తాను దగ్గరగా చూశానన్నారు. అంతటి భయంకరమైన వ్యాధితో పోరాడుతూనే, తన బాధను ఎక్కడా బయటపడనీయకుండా అసాధారణ మనోధైర్యంతో ఆమె తిరిగి కోలుకున్న తీరు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని రాహుల్‌ కంటతడి పెడుతూ వివరించారు.

అతిథులు వీరే..
ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, తమిళనాడు సీఎం సి.జోసెఫ్‌ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్, జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ దంపతులు, ఫరూఖ్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే, అభిషేక్‌ బెనర్జీ, పంజాబ్‌ మాజీ సీఎం, బీజేపీ నేత అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement