ఈ చిత్రంలో కనిపిస్తున్నది తెలంగాణ సరిహద్దును ఆనుకుని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూక ఏతాల గ్రామం. ఈ గ్రామంలో సమారు 2 వేల జనాభా ఉంది. మహారాష్ట్రలో ఊరు ఉన్నప్పటికీ ఇక్కడి 80 శాతం మంది తెలుగు మాట్లాడతారు. ఏతాల ఒకటే కాదు సరిహద్దును ఆనుకుని ఉన్న ధర్మాబాద్, రత్నెల్లి, బాలాపుర్, తురాఠి, రాఠినాందా, పాలజ్, నాయేగాం గ్రామాల్లో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. ఇక తెలంగాణ సరిహద్దు నిర్మల్ జిల్లాలో ఉన్న బెంబర, మొగ్లి, కోలూరు, జౌలా(బి), తొండాల, వాడోన, ఎల్విత్, ఉమ్రి(కే), బాసర మండలం ఓని, కౌట, బిద్రెల్లి, టాక్లి, కుభీర్, ముథోల్ మండలంలోని పలు గ్రామాల్లో 80 శాతం ఇక్కడి ప్రజలు మరాఠీ మాట్లాడుతున్నారు. రాష్ట్రాలు వేరైనా భాషాభిమానం చెరగడం లేదు.
తానూరు : నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా గతంలో మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్ జిల్లాలో ఉండేది. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. అంతకుముందు ఈ ప్రాంతమంతా మహారాష్ట్ర పరిధిలోనే ఉండేది. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భాషా వైవిధ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సరిహద్దుకు అటువైపు మరాఠీ మాట్లాడే తెలుగు ప్రజలు, ఇటువైపు తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్న మరాఠీ భాషీయులు కనిపిస్తారు. రాష్ట్రాలు, భాషలు వేరైనా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధం మాత్రం నిరంతరం కొనసాగుతోంది.
చరిత్ర నుంచి ప్రస్తుత స్థితి..
గతంలో ముధోల్ తాలూకా మహారాష్ట్రతో అనుబంధం కలిగి ఉండగా, భాషా ప్రాతిపదికన జరిగిన పునర్వ్యవస్థీకరణతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరి హద్దులో ఉండటంతో ఇక్కడి ప్రజల జీవన విధానంలో రెండు భాషల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మరాఠీ పలుకులు, తెలుగు చదువులు
సరిహద్దు గ్రామాల్లో అధిక సంఖ్యలో ప్రజలు మరాఠీలోనే మాట్లాడుకుంటూ నిత్యజీవితాన్ని సాగిస్తున్నారు. అయితే పిల్లల విద్య విషయంలో తెలుగు మాధ్యమాన్ని ఎంచుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు తమ పిల్లలకు మరాఠీ మాధ్యమంలో విద్య అందిస్తున్నారు. మాతృభాష ఒకటైతే విద్యాభాష మరొకటిగా ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకత.
వ్యవసాయమే ఆధారం.. భాషలే వారధులు
సరిహద్దు ప్రాంత ప్రజల్లో అధికశాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాగు పనులు, మార్కెట్లు, వ్యాపారాలు, కుటుంబ సంబంధాలు, పండుగలు, సంప్రదాయాల ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. భాషా భేదాలు ఉన్నప్పటికీ పరస్పర సంభాషణలు, ఆచార వ్యవహారాల్లో ఒకరి ప్రభావం మరొకరిపై స్పష్టంగా కనిపిస్తోంది.
భిన్న భాషలు, ఒక్కటైన బంధం
తెలంగాణలో మరాఠీ మాట్లాడటం, మహారాష్ట్రలో తెలుగు పలకడం ఈ సరిహద్దు ప్రాంతాల ప్రత్యేకతకు అద్దం పడుతోంది. ఒకవైపు తెలుగు భాషా సంస్కృతి, మరోవైపు మరాఠీ సంప్రదాయాలు కలిసి ఇక్కడి ప్రజల జీవనంలో ప్రత్యేకమైన సమ్మేళనాన్ని సృష్టిస్తున్నాయి. భాష కేవలం సంభాషణకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలను దగ్గర చేసే వారధిగా పనిచేస్తోందని ఈ ప్రాంత పరిస్థితులు చాటి చెబుతున్నాయి. రాష్ట్రాల సరిహద్దులు మారినా, తరతరాలుగా కొనసాగుతున్న భాషా అనుబంధాలు చెక్కుచెదరడం లేదు. తెలుగు, మరాఠీ భాషలు పరస్పరం కలిసి మెలిసి సాగుతున్న ఈ సరిహద్దు పల్లెలు భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.


