హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బిర్యానీ ధరలు! | Hyderabad Biryani Prices Hiked | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బిర్యానీ ధరలు!

Nov 16 2026 9:17 AM | Updated on Nov 16 2026 9:24 AM

Hyderabad Biryani Prices Hiked

  • హైటెక్‌ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో నిజామీ చికెన్‌ ధమ్‌ బిర్యానీ రూ.360 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.409కి పెంచారు. అంటే రూ.49 అదనంగా బాదారు.  

  • ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే ఓ హోటల్‌లో చికెన్‌ బిర్యానీ రూ.230కి అమ్మేవారు. ప్రస్తుతం రూ.50 పెంచి రూ.280కి విక్రయిస్తున్నారు. నగరంలో ఏ హోటల్‌లో చూసినా పెంచిన ధరలే దర్శనమిస్తున్నాయి.  

  • అమీర్‌పేటలోని ఓ ప్రముఖ హోటల్‌లో రెండు నెలల క్రితం చికెన్‌ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్‌ రూ.570 ఉండేది. ప్రస్తుతం రూ.600కి పెంచేశారు. అంటే ఒక దానిపై రూ.30 వరకు పెరిగింది.  

సాక్షి, హైదరాబాద్‌: వీకెండ్‌లో సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లే సామాన్య ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. బిర్యానీ ధర ప్లేటుపై రూ.50 వరకు, ఇడ్లీ, దోసె వంటి టిఫిన్ల ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరగడంతో మొత్తం బిల్లు తడిసి మోపెడవుతోంది. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటడంతో.. రెస్టారెంట్, హోటళ్లలో మెనూకు రెక్కలొచ్చాయి.   

వీరిపై ప్రభావం.. 
హైదరాబాద్‌లో 25 వేలకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వివిధ కారణాలతో బయట తినేవారికి ఇవే దిక్కు. కానీ ధరల పెంపుతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాచిలర్లపై ధరల ప్రభావం ఎక్కువ ఉంటుంది. నెలకు అదనంగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు భారంపడుతోంది. సిటీ పరిధిలో నిత్యం 6 లక్షల వరకు బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. ఒక్కో ప్లేట్‌పై మినిమం రూ.30 పెరిగితే రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతుంది. అంటే నెలకు రూ.54 కోట్లు.  

ఎగబాకిన ముడిసరుకు ధరలు  
ముడిసరుకు ధరలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో 15 శాతం 20 వరకు పెరిగాయి. వంట నూనె, గ్యాస్, బియ్యం, చికెన్‌ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయి. గతంలో కిలో నెయ్యి హోల్‌సేల్‌ ధర రూ.580 నుంచి రూ.620 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.800 దాటింది. పెరుగు, చీజ్‌ ధరలు కూడా 20 శాతం పెరిగాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ గతంలో రూ.1750 ఉండగా, ప్రస్తుతం రూ.3080 ఉంది. వంట నూనె లీటర్‌ రూ.150కి ఎగబాకింది. వర్షాభావం వల్ల కూరగాయల ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. కిలో బియ్యం సెంచరీకి చేరువలో ఉంది. స్టాఫ్‌ జీతాలు, అద్దెలు కూడా పెరగడంతో ఫుడ్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.  

పెంచక తప్పని పరిస్థితి 
నగరంలో హోటల్‌ బిజినెస్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. లాభాలు పోయి.. నష్టాలు వస్తున్నాయి. ముడిసరుకుల ధరలు పెరగడంతో చేసేదేం లేక కొన్ని హోటళ్లు ధరలు పెంచేశాయి. దీంతో కస్టమర్లు దూరమవుతారనే బాధ ఉంది. కానీ పెంచకుంటే హోటళ్లు నడపలేని దుస్థితి. 
– కంచర్ల అశోక్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌  

ఇదీ చదవండి: పేరుకు జనసేన... పార్టీ మాత్రం టీడీపీ


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement