పోగొట్టుకున్న సొమ్ము వెనక్కి తెచ్చేందుకు ఎంఆర్‌ఎం
ఫ్రీజ్ ఖాతాల సమస్యలకు జీఆర్‌ఎం
సైబర్ మోసాలపై ఫిర్యాదు నుంచి నగదు పునరుద్ధరణ వరకు ప్రత్యేక వ్యవస్థ
రూ.58.25 కోట్లు రిఫండ్ చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 8712665600
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బు కోల్పోయిన బాధితులు ఒకవైపు.. సైబర్ నేరాల ఫిర్యాదుల ఆధారంగా తమ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ఖాతాదారులు మరోవైపు.. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపేలా కేంద్ర హోంశాఖ కీలక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్)లో భాగంగా మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్‌ఎం), గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మాడ్యూల్ (జీఆర్‌ఎం)ను రూపొందించింది. 2026 ఏప్రిల్ నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి. సైబర్ మోసాల్లో నిలిపివేసిన నగదును బాధితులకు తిరిగి అందించడం, అనవసరంగా ఫ్రీజ్ అయిన ఖాతాలపై ఫిర్యాదులను నిరీ్ణత గడువులో పరిష్కరించడం వీటి ప్రధాన ఉద్దేశం.
ఫిర్యాదు చేసిన వెంటనే...
సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు 1930 హెల్ప్‌లైన్‌కు లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www. cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. అప్పుడు 14 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. ఆ వివరాలు సంబంధిత పోలీసు విభాగానికి చేరిన తర్వాత, ప్రాథమికంగా సైబర్ ఆర్థిక నేరం జరిగినట్లు గుర్తిస్తే సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్ వ్యవస్థలోకి ఫిర్యాదును పంపిస్తారు. సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సమాచారం అందించి, మోసపోయిన సొమ్ము ఏయే ఖాతాలకు బదిలీ అయిందో గుర్తించి, అందుబాటులో ఉన్న మొత్తాన్ని నిలిపివేసే చర్యలు చేపడతారు.
అమల్లో టాప్‌లో తెలంగాణ
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) అధికారులు, తెలంగాణ పోలీసు స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో జీఆర్‌ఎం, ఎంఆర్‌ఎం అమల్లో కీలక చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఈ మాడ్యూల్స్ అమలులో తెలంగాణ పోలీసులు టాప్‌లో నిలిచారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 2026 నుంచి ఇవి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈనెల 7 వరకు టీజీ సీఎస్‌బీ అధికారులు ఎంఆర్‌ఎంలో 87,607 మంది బాధితులు అభ్యర్థులు రాగా 81,170 మంది బాధితులకు సంబంధించిన అభ్యర్థనలు పరిశీలించి రూ.58.25 కోట్లు రిఫండ్ చేశారు. అదేవిధంగా జీఆర్‌ఎం కింద మొత్తం 9,590 అభ్యర్థనలు రాగా.. 9,139 అభ్యర్థనల పరిశీలన పూర్తి చేశారు.
ఇవి మరవొద్దు...
⇒ సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలి.
⇒ www. cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలి.
⇒ ఎన్‌సీఆర్‌పీ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను భద్రపరచుకోవాలి.
⇒ బ్యాంకు స్టేట్‌మెంట్లు, యూపీఐ/ఆన్‌లైన్ లావాదేవీల రశీదులు, సందేశాలను భద్రపరచాలి.
⇒ ఖాతా ఫ్రీజ్ అయితే బ్యాంకును సంప్రదించి జీఆర్‌ఎం ప్రక్రియ ద్వారా ఫిర్యాదు చేయాలి.
⇒ రిఫండ్ పేరుతో డబ్బులు అడిగే మధ్యవర్తులను నమ్మకూడదు.
తెలంగాణలో ప్రత్యేక హెల్ప్‌లైన్
సైబర్ బాధితులకు న్యాయం చేసేలా జీఆర్‌ఎం, ఎంఆర్‌ఎం వినియోగంలో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది. తెలంగాణలో ఎంఆర్‌ఎం, జీఆర్‌ఎం వినియోగంపై సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా 8712665600 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంఆర్‌ఎం, జీఆర్‌ఎం వినియోగంపై అవగాహన కలి్పంచే వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి.
–టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్


