ఖేలో ఇండియా లోగో, మస్కట్‌ను ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి. చిత్రంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కరువును అధిగమించేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం చేయండి
ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి వినతి
రాష్ట్రంలో 365 మండలాల్లో కరువు పరిస్థితులు
పంటలు నష్టపోయిన రైతన్నలను ఆదుకోవడానికి, గ్రామీణ ఉపాధిని పెంచడానికి సహకరించాలి
రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి, అనుమతుల విషయంలో చొరవ చూపండి
తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి
సమ్మక్క–సారలమ్మ బరాజ్‌కు ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ ఇప్పించండి
ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలన్న సీఎం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు రావాలంటూ ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను అధిగమించేందుకు తక్షణమే రూ.30 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేలా చూడాలని, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
న్యూఢిల్లీలో 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనతో రేవంత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిని వారు సత్కరించారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ప్రాజెక్టులు, ఇతర అంశాల గురించి ప్రధానికి సీఎం వివరించారు.
తక్షణమే స్పందించండి..
‘కరువు పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం తక్షణమే స్పందించాలి. కరువు సహాయక చర్యల కోసం రూ.30 వేల కోట్ల నిధులు ఇవ్వాలి. రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి. యాసంగి అవసరాల దృష్ట్యా 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్ ఇవ్వడంతో పాటు రైతులకు సరిపడా ఎరువులను సకాలంలో కేటాయించాలి. గ్రామీణ వలసలను నివారించేందుకు ఉపాధి హామీ (వీబీజీ రాంజీ) పథకం కింద అదనంగా 50 పని దినాలను కల్పించాలి..’ అని సీఎం కోరారు.
తుమ్మిడిహెట్టి ముంపు పరిహారం చెల్లించేందుకు సిద్ధం
⇒ ‘ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. (ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు) ముంపు పరిహారం చెల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని అందించే అవకాశం కలుగుతుంది. సమ్మక్క–సారక్క బరాజ్ ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో ముంపు సర్వే కోసం ఇప్పటికే రూ.9.88 కోట్లు చెల్లించాం. ఆ రాష్ట్రం నుంచి త్వరగా ఎన్‌ఓసీ జారీ అయ్యేలా చొరవ తీసుకోండి. సీడబ్ల్యూసీ అనుమతులు కూడా వచ్చేలా చూడండి.
పెండింగ్‌లో అనుమతులు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్), సీతమ్మ సాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్‌ఐఎస్) కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారీగా వ్యయం చేసింది. అయినా ఇప్పటికీ పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. పర్యావరణ అనుమతుల విషయమై ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచి్చన నేపథ్యంలో, ఆయా ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు ఇప్పించాలి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. లేదా తగిన ఆర్థిక సాయం అందించాలి.
‘ఇందిరమ్మ’కు, మెట్రోకు నిధులు కేటాయించండి
రాష్ట్రంలో 70 నుంచి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం పథకం (సాస్కీ) కింద అదనంగా రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలి. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్–సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగు ప్రాజెక్టుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా–కొరాటా బరాజ్‌కు రూ.103 కోట్లు మంజూరు చేయాలి.
సమక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమరి్పంచాం. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూమి తదితర అంశాలపై సమగ్ర సర్వే కోసం రూ.9.88 కోట్లు చెల్లించాం. ముంపు, నిర్వాసితులకు సంబంధించిన పరిహారం ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం తరఫున రుణ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ రండి..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’, ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ సంబంధిత కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధానిని సీఎం ఆహ్వానించారు. ఖేలో ఇండియా క్రీడలు డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలకు రావాలని పీఎంను కోరారు. అలాగే డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ (భారత్ ఫ్యూచర్ సిటీ) వేదికగా జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు ప్రారం¿ోత్సవానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఖేలో ఇండియా లోగో, మస్కట్ ఆవిష్కరణ
ప్ర«దానితో భేటీ అనంతరం కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధికారిక నివాసంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆయనతో కలిసి ఖేలో ఇండియా క్రీడల అధికారిక లోగో, మస్కట్‌లను ఆవిష్కరించారు. హైదరాబాద్ సహా వివిధ జిల్లా కేంద్రాల్లో జరగనున్న ఈ క్రీడలకు సంబంధించిన వేదికల అభివృద్ధి, నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు.


