15 రోజులుగా లోయలో చిక్కుకున్న టీచర్‌.. బురద నీటిని తాగుతూ.. | Missing for 15 days Odisha teacher found alive in ravine after | Sakshi
Sakshi News home page

15 రోజులుగా లోయలో చిక్కుకున్న టీచర్‌.. బురద నీటిని తాగుతూ..

Nov 15 2026 8:11 PM | Updated on Nov 15 2026 8:22 PM

Missing for 15 days Odisha teacher found alive in ravine after

భువనేశ్వర్‌: ఒడిశాలో ప్రకృతి విపత్తు కారణంగా 15 రోజులుగా అటవీ ప్రాంతంలోని లోతైన లోయలో చిక్కుకుపోయిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. మేకలను మేపేందుకు అడవిలోకి వెళ్లిన ఓ యువకుడు ఆయన ఆర్తనాదాలు విని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర నీరసం, ఆకలితో బలహీనపడిన ఆయనను శనివారం రక్షించి ఆసుపత్రికి తరలించారు.

కంధమాల్ జిల్లాలోని దుబా ప్రాంతం సర్సపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మోహన్ కుమార్ మహారాణా (47) అక్టోబర్ 29న పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తుపాను ఆర్నబ్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డంగేసి గ్రామం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో కొండపై నుంచి జారిపడిన ఆయన అడవిలోని లోతైన గోతిలో చిక్కుకుపోయారు. చుట్టుపక్కల వారు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడంతో ఆయన ఇతరుల నుంచి విడిపోయారు.

అడవిలో చిక్కుకున్న ఆయనకు బయటకు వచ్చే మార్గం కనిపించలేదు. నిరంతర వర్షాలు, వరదలు, సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఆకలి, అలసటతో సాయం కోసం చేసే అరుపులు కూడా క్రమంగా బలహీనపడ్డాయి. మేకల కాపరి అడవిలోకి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి నుంచి మెల్లగా అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూడగా మహారాణా ఓ రాతిపై అత్యంత దీనస్థితిలో కనిపించారు. వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు.

ఈ విషయాన్ని రైకియా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి ఏ స్వర్ణలత పాత్రా వెల్లడించారు. పోలీసు సిబ్బంది, స్థానికులతో కలిసి ఆమె సహాయక చర్యలకు నాయకత్వం వహించారు. దట్టమైన అడవిలో సుమారు 7 నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన రక్షణ బృందం.. చెక్క కర్ర, బెడ్‌షీట్‌తో తాత్కాలిక పల్లకీ తయారుచేసి ఆయనను బయటకు తీసుకొచ్చింది.

బురద నీటిని తాగి బతికి.. 
అడవిలో బతికేందుకు గోతిలో నిలిచిన బురద నీటితోపాటు సమీపంలోని వాగుల నీటిని తాగినట్లు మహారాణా భార్య తెలిపారు. తినేందుకు దొరికిన ఆహార పదార్థాలను తీసుకున్నారని చెప్పారు. ఒక దశలో శరీరం పూర్తిగా బలహీనపడటంతో బయటపడేందుకు ప్రయత్నించే శక్తి కూడా లేకుండా పోయిందని వివరించారు.

నవంబర్ 5న కుటుంబ సభ్యులు రైకియా పోలీస్‌ స్టేషన్‌లో అదృశ్యమైన వ్యక్తిగా ఫిర్యాదు చేశారు. సమీప గ్రామాల ప్రజలకు కూడా పోలీసులు సమాచారం అందించారు. ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా.. ఆ ప్రాంతంలో సరిగా నెట్‌వర్క్‌ లేకపోవడం, వర్షానికి ఫోన్‌ బ్యాటరీ అయిపోయి ఉంటుందనే కారణాలతో ఫలితం లేకపోయిందని ఆయన భార్య తెలిపారు.

రక్షించిన అనంతరం మహారాణాను రైకియా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సుదీర్ఘకాలం ఆహారం లేకపోవడం, శారీరక అలసట కారణంగా ఆయన తీవ్రంగా బలహీనపడ్డారని వైద్యులు తెలిపారు. గాయాలు కూడా ఉన్నాయని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఫుల్బానీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు.

ఇదిలా ఉండగా, తుపాను ఆర్నబ్, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో రైకియా ప్రాంతంలో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. ప్రభావిత గ్రామాల ప్రజలను మానికేశ్వర్‌లోని సహాయక శిబిరాలతోపాటు ఇతర ప్రభుత్వ శిబిరాలకు తరలించారు. పాఠశాలలు మూతపడటం, గ్రామాలు ఖాళీ కావడంతో అడవికి సమీప ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని పోలీసులు తెలిపారు.

డంగేసి సమీపంలో కొండచరియలు విరిగిపడి ఓ కొండపై ఉన్న ఇల్లు మట్టిలో కూరుకుపోవడంతో 9 నెలల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పొరుగున ఉన్న గంజాం జిల్లాలోని గిడిపబాలి గ్రామంలోనూ కొండచరియలు విరిగిపడటంతో ఐదు మృతదేహాలను వెలికితీశారు. మరో ఆరుగురు ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో జిల్లా యంత్రాంగం సోమవారం నిలిపివేసింది. దాదాపు 30 అడుగుల లోతున భారీ బండరాళ్లు, శిథిలాల కింద తమ ఇళ్లు, కుటుంబ సభ్యులు కూరుకుపోయి ఉండవచ్చని వారు అధికారులకు రాతపూర్వకంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement