అదృశ్యమైన పోలీసులు.. అనుమానాస్పద మృతి | Bodies Of 2 Missing Spos Recovered In J And K Kishtwar | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన పోలీసులు.. అనుమానాస్పద మృతి

Nov 12 2026 10:06 AM | Updated on Nov 12 2026 10:18 AM

Bodies Of 2 Missing Spos Recovered In J And K Kishtwar

జమ్మూకశ్మీర్‌: విధి నిర్వహణలో ఉండగా అదృశ్యమైన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల (ఎస్‌పీఓ)మృతదేహాలు లభ్యమయ్యాయి. కిష్త్వార్‌ జిల్లాలోని మారుమూల దచన్‌-మార్వా ప్రాంతంలో వీరి మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి.గత కొన్ని గంటలుగా గాలింపు చర్యలు చేపట్టిన బృందం.. ధెర్నా పోస్టు సమీపంలో మృతదేహాలను గుర్తించింది. అదృశ్యమైన కొన్ని గంటలకే వారిద్దరూ తుపాకీ గాయాలతో విగతజీవులుగా కనిపించడం కలకలం రేపుతోంది.

మృతులను రష్‌పాల్‌ కుమార్‌ (40), బాబీ చంద్‌ (54)గా గుర్తించారు. వీరిలో ఒకరి తలపై, మరొకరి వీపుపై తుపాకీ గాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాటువేసిన ఉగ్రవాదులు వీరిపై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. విధుల్లో ఉన్న మరో ఇద్దరు సహచరులకు బదులుగా బాధ్యతలు చేపట్టేందుకు ధెర్నా పోస్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి వద్ద ఉన్న ఇన్సాస్‌, రైఫిళ్లు కూడా కనిపించడం లేదు. పోలీసులను హతమార్చిన అనంతరం ఉగ్రవాదులు ఆయుధాలను ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరిద్దరూ ఆర్మీ బృందంతో కలిసి పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్నారు. ధెర్నా పోస్టుకు వెళ్తున్న సమయంలో అదృశ్యమయ్యారు. పగటిపూట ఆ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు సమాచారం. తొలుత ఇద్దరి మొబైల్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

వారు తిరిగి రాకపోవడంతో పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు ఇవాళ (గురువారం) ఉదయం ధెర్నా టాప్‌ ప్రాంతంలో వారి మృతదేహాలను గుర్తించారు. ఈ హత్యలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కిష్త్వార్‌ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు కొంతకాలంగా విస్తృతంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమవడంతో ఆ ప్రాంతంలో వారి కార్యకలాపాలు బలహీనపడ్డాయని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

అక్టోబర్ 16న కిష్త్వార్‌లో మరో ఎస్‌పీవో బషీర్ అహ్మద్ (55) మృతదేహం లభ్యమైంది. వనిపోరా త్రిగామ్‌లోని తన నివాసం సమీపంలో బషీర్ అహ్మద్ మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సర్వీస్ రైఫిల్‌తో సహా అదృశ్యమయ్యారు. భూ వివాదం నేపథ్యంలో బంధువులే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తాజా ఘటనతో కిష్త్వార్ జిల్లాలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: పవార్‌ ఫ్యామిలీలో ట్విస్ట్‌.. సునేత్రా వ్యాఖ్యలతో పొలిటికల్ సస్పెన్స్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement