చెన్నై: తమిళనాడులో టపాసులు కాల్చే విషయంలో జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారింది. రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని చెప్పిన పోలీసు అధికారిపై కొందరు దాడి చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తేని జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ సెంథిల్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. సెంథిల్ కుమార్ విధులు ముగించుకుని సాధారణ దుస్తుల్లో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుకు మధ్యలో నిలబడి టపాసులు కాల్చడం ఆయన గమనించారు. దీంతో రోడ్డుపై బాణసంచా కాల్చడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, అలా చేయవద్దని వారిని హెచ్చరించారు.
ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆ గుంపులోని ఒక వ్యక్తి సెంథిల్ కుమార్‌ను తోసేయడంతో పాటు మోచేతితో బలంగా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
సెంథిల్ కుమార్ తేని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు గతంలో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
మరోవైపు, ఈ ఘటనపై తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హత్యలు జరిగాయని ఆరోపించారు. ‘‘సమర్థత లేని ఈ ప్రభుత్వ హయాంలో ఒకే రోజున పోలీసు సిబ్బంది సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. పండుగ రోజున టపాసుల శబ్దాల కంటే కొడవళ్లతో జరుగుతున్న దాడులే ఎక్కువగా వినిపిస్తున్న ఈ సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. పోలీసు అధికారి మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది.


