ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి వేడుకలు, బాణసంచా పేలుళ్ల తర్వాత గాలి నాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్కును దాటడంతో నగరం విషవాయువుల కోరల్లో చిక్కుకుంది. బయటకు వెళ్తే గొంతులో మంట.. కళ్లలో దురద.. ఆగని దగ్గు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఇలా కాలుష్యం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే AQI 200, 300, 400 దాటితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏ స్థాయిలో ప్రాణాలకు ముప్పు పెరుగుతుంది? వైద్య నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారు?
AQI 100–200: సమస్య మొదలయ్యేది ఇక్కడే!
గాలి నాణ్యత సూచీ 100 దాటినప్పటి నుంచి సున్నితమైన ఆరోగ్యం కలిగినవారిలో స్వల్ప శ్వాస సంబంధిత సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. గాలిలో ఉండే PM2.5 సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరి శ్వాసనాళాల్లో మంట, దగ్గు, గొంతు ఇబ్బందులకు కారణమవుతాయి.
AQI 200–300: ఊపిరితిత్తులకే కాదు.. గుండెకూ ముప్పు!
కాలుష్యం మరింత పెరిగితే శరీరంలో వాపు, కణాలకు నష్టం కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతాయి. రక్తనాళాలపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఆస్తమా, సీఓపీడీ ఉన్నవారికి సమస్యలు తీవ్రం కావచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ దగ్గు, ఛాతీలో నొప్పి, వ్యాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపించవచ్చు. గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
AQI 300–400: దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతం!
ఈ స్థాయిలో కాలుష్యానికి ఎక్కువసేపు గురైతే శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారి పరిస్థితి మరింత దిగజారవచ్చు. పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. గర్భిణులు కాలుష్యానికి గురైతే నెలలు నిండకముందే ప్రసవం, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం వంటి సమస్యలతో సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
AQI 400–500: ఆరోగ్యవంతులకూ తప్పని ప్రమాదం!
ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయి. ఈ దశలో ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ శ్వాస సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. దగ్గు, గొంతులో మంట, పిల్లికూతలు, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. గుండె స్పందనలో అసమానతలు, గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు, బయట ఎక్కువసేపు పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, నిర్మాణ రంగ కార్మికులు, డెలివరీ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యం రోజుల తరబడి కొనసాగితే ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు కూడా పెరగవచ్చు.
AQI స్థాయిలు ఇవే.. ఏది ఎంత ప్రమాదకరం?
అయితే AQI 200 దాటినప్పుడే ప్రమాదం మొదలవుతుందని భావించకూడదు. తక్కువ స్థాయిలోనూ కాలుష్యం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.భారత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) గాలి నాణ్యతను ఆరు విభాగాలుగా వర్గీకరిస్తుంది.
0–50: మంచి గాలి నాణ్యత
51–100: సంతృప్తికరం
101–200: మధ్యస్థం
201–300: పేలవం
301–400: అత్యంత పేలవం
401–500: తీవ్ర ప్రమాదకర స్థాయి
కాలుష్యం నుంచి రక్షించుకోవడం ఎలా?
కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు బయట వ్యాయామాలు, నడకలు తగ్గించాలి.
తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే సరైన ఫిట్ ఉన్న N95 లేదా FFP2 మాస్క్ ధరించాలి.
ఇంట్లో పొగ, ధూపం, సిగరెట్ వంటి కాలుష్య కారకాలను తగ్గించాలి.
పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు బయట ఎక్కువసేపు ఉండకూడదు.
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి.
గాలి కాలుష్యం అంటే కేవలం దగ్గు, జలుబు సమస్య మాత్రమే కాదు. అది ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలపై ప్రభావం చూపే తీవ్రమైన ఆరోగ్య సమస్య. AQI 400 దాటినప్పుడు ఆరోగ్యవంతులు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే కాలుష్య సూచీని గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.
ఇదీ చదవండి: ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్.. టైమ్ దాటినా టపాసుల మోత!


