ఢిల్లీ: దేశమంతా దీపావళి వెలుగులతో మెరిసిపోతుంటే.. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం విషపూరిత పొగమంచులో చిక్కుకుంది. ఇళ్ల ముందు దీపాల కాంతులు కనిపిస్తున్నా.. వీధుల్లో మాత్రం కాలుష్య మేఘాలు కమ్ముకున్నాయి. టపాసుల మోతకు ముందే విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ ప్రజలకు పండుగ వేళ ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. గాలి నాణ్యత సూచీ (AQI) 383కు చేరడంతో నగరం అత్యంత పేలవమైన గాలి నాణ్యత విభాగంలో కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి ఏకంగా 450కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పండుగ సంబరాలు.. మరోవైపు కాలుష్య కష్టాలు.. వెరసి దేశ రాజధానిని విషపూరిత పొగమంచు కమ్మేసింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) గణాంకాల ప్రకారం ఢిల్లీలోని 54 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 24 చోట్ల AQI తీవ్ర స్థాయికి చేరింది. జహంగీర్‌పురిలో అత్యధికంగా 450, ఆర్కే పురంలో 448 పాయింట్లు నమోదయ్యాయి. పంజాబీ బాగ్, ఐఐటీ ఢిల్లీ, ద్వారక, రోహిణి ప్రాంతాల్లోనూ కాలుష్య స్థాయులు 400 దాటాయి. ఇండియా గేట్ పరిసరాల్లో 398, నరేలాలో 395, ఆనంద్ విహార్‌లో 328 పాయింట్లుగా నమోదయ్యాయి.
#WATCH | Delhi | Air Quality Index (AQI) around AIIMS is 421, categorised as 'Severe', as per the CPCB (Central Pollution Control Board). (Visuals shot at 07:19 am) https://t.co/GjUNOlIcsN
— ANI (@ANI) November 8, 2026
తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగిన కాలుష్యం!
గత మూడు రోజుల గణాంకాలు పరిశీలిస్తే ఢిల్లీ వాయు నాణ్యతలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. శుక్రవారం 382గా ఉన్న AQI శనివారం 369కి తగ్గినా.. ఆదివారం ఉదయానికి మళ్లీ 383కు చేరుకుంది. నవంబర్ 8, 9 తేదీల్లోనూ కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించింది.
కాలుష్యానికి కారణాలివే!
చలికాలం ప్రారంభం కావడంతో గాలి వేగం తగ్గడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోయేలా చేస్తున్నాయి. వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. మొత్తం కాలుష్యంలో వాహనాల వాటా 21.4 శాతంగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీనికి తోడు దీపావళి టపాసుల వినియోగం గాలి నాణ్యతపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
గ్రాప్-3 ఆంక్షల కొరడా!
కాలుష్య తీవ్రతను నియంత్రించేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రాప్-3 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అత్యవసరం కాని నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేశారు. రోడ్ల నిర్మాణం, మట్టి తవ్వకాలు, భూమిని చదును చేసే పనులపై ఆంక్షలు విధించారు. రాళ్ల క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాలపైనా నిషేధం విధించారు. వాహనాల విషయంలోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపై నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇప్పటికే అమల్లో ఉన్న గ్రాప్-1, గ్రాప్-2 చర్యలకు అదనంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు.
ఏక్యూఐ అంటే ఏమిటి?
0–50: మంచి గాలి
51–100: సంతృప్తికరం
101–200: మోస్తరు
201–300: పేలవం
301–400: అత్యంత పేలవం
401–500: తీవ్రమైన కాలుష్యం.
ఇదీ చదవండి: 2029లో మోదీ సర్కార్ ఓటమి తథ్యం


