ప్లేట్ నిండా డబ్బు కట్టలు.. ఉద్యోగులకు బాస్ సర్‌ప్రైజ్! | Surat Trader Gives Each Staff Rs 1 Lakh Cash as Diwali Bonus | Sakshi
Sakshi News home page

ప్లేట్ నిండా డబ్బు కట్టలు.. ఉద్యోగులకు బాస్ సర్‌ప్రైజ్!

Nov 8 2026 8:09 AM | Updated on Nov 8 2026 8:11 AM

Surat Trader Gives Each Staff Rs 1 Lakh Cash as Diwali Bonus

దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు చాలామంది యజమానులు స్వీట్లు, బట్టలు లేదా కొంత నగదును బహుమతిగా ఇస్తుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం తన ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా బోనస్‌గా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా డబ్బు అందుకున్న ఓ మహిళలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సూరత్‌కు చెందిన రామ్‌స్వరూప్ ముండే.. టెక్స్‌టైల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తన దగ్గర పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు దీపావళి సందర్భంగా భారీ నగదు బోనస్ ఇచ్చారు. ఇందుకోసం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లను ఒక వెండి రంగు ప్లేట్‌లో అందంగా పేర్చి ఉద్యోగులకు అందజేశారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా ఇవ్వడంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ పంపిణీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా ముండే మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ముఖ్యంగా పండుగల సమయంలో కుటుంబాలు పడే కష్టాలు తనకు తెలుసని చెప్పారు. అందుకే.. తన దగ్గర పనిచేసే ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తానని తెలిపారు. ఏడాది పొడవునా వారు పడే కష్టానికి గుర్తింపుగా ఈ బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

తన వ్యాపారం అభివృద్ధి చెందడంలో.. ఉద్యోగుల కష్టం, అంకితభావం ఎంతో ఉందని ముండే పేర్కొన్నారు. దీపావళి సమయంలో ప్రతి ఉద్యోగి తన కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుక్కొని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. అందుకే ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా నగదు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

ఇదీ చదవండి: జీతం రూ.2 లక్షలు, ఇన్‌స్టా ద్వారా రూ.2 లక్షలు.. నేను జాబ్ మానేయొచ్చా?

ఈ వీడియో చూసిన నెటిజన్లు వ్యాపారవేత్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ఇంత పెద్ద మొత్తంలో బోనస్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయమని అంటున్నారు. వ్యాపారం అంటే కేవలం లాభాలు సంపాదించడం మాత్రమే కాదని, మన ఎదుగుదలకు తోడ్పడిన వారిని కూడా సంతోషంగా ఉంచడం ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement