ఇల్లు ఉందని మిడిసిపడకండోయ్‌.. | Rich Dad Poor Dad Robert Kiyosaki says Your House Is a Liability | Sakshi
Sakshi News home page

ఇల్లు ఉందని మిడిసిపడకండోయ్‌..

Nov 7 2026 9:12 PM | Updated on Nov 7 2026 9:19 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki says Your House Is a Liability

నెలనెలా మీ జీతాన్ని ఖాళీ చేస్తున్న ఇంటిని అతిపెద్ద ఆస్తిగా ఎలా భావిస్తారు? సంపద సృష్టించాలంటే నెట్‌వర్త్‌ కంటే నగదు ప్రవాహానికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సూచించారు. పెట్టుబడుల ద్వారా ఆదాయం సంపాదించే విధానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితకాలం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనుగోలు చేసి, దానిని తమ అతిపెద్ద ఆస్తిగా భావిస్తుంటారు. అయితే ప్రముఖ ఆర్థిక రచయిత, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన సొంత ఇల్లు నిజంగా ఆస్తేనా? లేక ప్రతి నెలా మన జేబులోని డబ్బును ఖాళీ చేసే బాధ్యతా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్టులో సంపద సృష్టి, పెట్టుబడులు, నగదు ప్రవాహంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆస్తి అంటే జేబులోకి డబ్బు రావాలి..

కియోసాకి తన తొమ్మిదేళ్ల వయసులో రిచ్ డాడ్ తనకు మోనోపలీ ఆట ద్వారా నేర్పిన పాఠాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ ఆటలో ఇళ్లు కొనుగోలు చేసి, వాటిపై ఇతరులు అడుగుపెట్టిన ప్రతిసారీ అద్దె రూపంలో డబ్బు సంపాదించే విధానాన్ని వివరించారని చెప్పారు. బ్యాంకులో ఎంత డబ్బు ఉందన్నది ముఖ్యం కాదని, ఎంత నగదు నిరంతరం మన చేతికి వస్తోందన్నదే సంపదకు అసలైన కొలమానమని పేర్కొన్నారు. పాఠశాలలు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్ వ్యవస్థలు ఈ విషయాన్ని మనకు స్పష్టంగా బోధించవని అభిప్రాయపడ్డారు.

పెట్టుబడులతో డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు

పెట్టుబడుల ద్వారా ఆదాయం సంపాదించడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయని కియోసాకి వివరించారు. మొదటిది క్యాపిటల్ గెయిన్స్. ఉదాహరణకు ఒక షేరును రూ.50కి కొనుగోలు చేసి, దాని ధర రూ.75కి పెరిగినప్పుడు విక్రయించడం ద్వారా లాభం పొందవచ్చు. అయితే ధర పెరిగే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈలోగా ఎలాంటి ఆదాయం రాకపోవచ్చు. 2005, 2006లో రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనుగోలు చేసి, ధరలు పెరిగిన తర్వాత విక్రయించిన చాలామంది భారీగా సంపాదించారని, అయితే 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత వారిలో చాలామంది తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ధరలు పెరుగుతాయనే ఆశతో పెట్టుబడి పెట్టడం కంటే అది ఒక రకమైన పందెం వంటిదని పేర్కొన్నారు.

రెండో మార్గం క్యాష్ ఫ్లో. అంటే అద్దెలు, వ్యాపార లాభాలు, షేర్ల డివిడెండ్లు, ఆప్షన్స్ ప్రీమియంల రూపంలో క్రమం తప్పకుండా ఆదాయం పొందడం. పెట్టుబడి విలువ పెరిగినా, తగ్గినా లేదా స్థిరంగా ఉన్నా ఆదాయం వస్తూనే ఉంటుందని వివరించారు. 2008లో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ తాను, తన భార్య కిమ్ ప్రతి నెలా అద్దె ఆదాయాన్ని పొందుతూనే ఉన్నామని చెప్పారు.

ఇల్లు ఖరీదు పెరిగితే సరిపోదు..

సొంత ఇంటి విషయంలోనూ కియోసాకి ఇదే సూత్రాన్ని ప్రస్తావించారు. ఇంటి విలువ పెరిగి రూ.5 కోట్లకు చేరిందని చెప్పుకోవడం వల్ల తక్షణ నగదు ఆదాయం సమకూరదని అన్నారు. ఆస్తిపన్ను, బీమా, మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చుల రూపంలో ప్రతి నెలా ఇంటి కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తుందని గుర్తుచేశారు. ఇంటి మార్కెట్ విలువ నికర సంపదను పెంచవచ్చేమో కానీ, విద్యుత్ బిల్లు చెల్లించడానికి ఆ విలువ ఉపయోగపడదని వ్యాఖ్యానించారు.

ఏడాదికి రూ.50 లక్షలు సంపాదిస్తూ రూ.55 లక్షలు ఖర్చు చేస్తే ఆ వ్యక్తి ఆర్థికంగా బలహీనంగానే ఉంటారని వివరించారు. అదే సమయంలో తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ, పని చేయకపోయినా తమ ఆస్తుల నుంచి నెలకు రూ.10 లక్షలు వస్తుంటే వారు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండగలరని పేర్కొన్నారు.

మీరు ఖర్చు చేసేది మరొకరికి ఆదాయం!

మన ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ బ్యాంకుకు ఆదాయమని, క్రెడిట్ కార్డు వడ్డీ ఆ సంస్థలకు లాభమని కియోసాకి గుర్తుచేశారు. మన జేబు నుంచి బయటకు వెళ్లే ప్రతి రూపాయి మరొకరి ఆదాయంగా లేదా ఆస్తిగా మారుతుందని పేర్కొన్నారు. సంపన్నులు ఈ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుంటారని, ఇతరులు చెల్లించే అద్దెలు, వడ్డీలు, ఇతర ఖర్చుల ద్వారా వారు ఆదాయం పొందుతారని వివరించారు.

కాబట్టి తదుపరి పెట్టుబడి పెట్టే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలని సూచించారు. 'ఈ పెట్టుబడి ఇప్పుడే నా జేబులోకి డబ్బును తీసుకొస్తుందా? లేక భవిష్యత్తులో ధర పెరుగుతుందనే ఆశతోనే కొనుగోలు చేస్తున్నానా?' అని ప్రశ్నించుకోవాలన్నారు. కేవలం ఆశతో పెట్టుబడి పెడితే అది జూదంతో సమానమని, నిరంతర నగదు ప్రవాహాన్ని అందించే ఆస్తులను నిర్మించుకుంటేనే సంపద పెరుగుతుందని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement