డబ్బును దాచుకుంటే దరిద్రం!? | rich dad poor dad Robert Kiyosaki Why Saving Money in Broken System Scam | Sakshi
Sakshi News home page

డబ్బును దాచుకుంటే దరిద్రం!?

Nov 4 2026 9:06 PM | Updated on Nov 4 2026 9:06 PM

rich dad poor dad Robert Kiyosaki Why Saving Money in Broken System Scam

ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషకులు, బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ టి.కియోసాకి ఆధునిక ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ బ్యాంకు ఖాతాలు, సేవింగ్స్ విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలు తమ ఆర్థిక వ్యూహాలను తక్షణమే మార్చుకోవాలని హెచ్చరించారు. తన జీవితంలో జరిగిన ఒక పొరపాటును, తన ఇద్దరు తండ్రుల (రిచ్‌ డాడ్‌, పూర్‌ డాడ్‌) పాఠాలను ఉదాహరిస్తూ ఆయన చెప్పిన విశ్లేషణ ఆర్థిక రంగంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన అంశాలు ఆయన తన సోషల్‌మీడియా హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.

నాకు 20 ఏళ్ల వయసున్నప్పుడు లాస్ వెగాస్ జూదశాలలో నా వద్ద ఉన్న 3000 డాలర్లు పెరుగుతుంటే చూసి మురిసిపోయాను. దురాశతో ఉన్న డబ్బునంతటినీ ఒకే ఆటపై పందెం కాసి ఒక్క క్షణంలో మొత్తాన్ని పోగొట్టుకున్నాను. చాలామంది తమ జీవితకాల పొదుపు విషయంలో సరిగ్గా ఇదే పొరపాటును నిదానంగా (స్లో మోషన్) చేస్తుంటారు. ఆర్థిక సలహాదారులను కలిసి ‘నాకు ఎంత లాభం వస్తుంది?’ అని మాత్రమే అడుగుతారు. వారు 8, 10 లేదా 12 శాతం వస్తుందని చెప్పగానే నమ్మేస్తారు. కానీ అది సగం నిజం మాత్రమే!

అసలు విషయం ఏమిటంటే..

నా పూర్‌ డాడ్‌ ఎప్పుడూ పెన్షన్ చెక్కు కోసం చూసే సగటు మనిషిలా ఆలోచించేవారు. కానీ రిచ్‌ డాడ్‌ నా జీవితాన్ని మార్చే ఒక గొప్ప సత్యాన్ని నేర్పించారు. ‘పెట్టుబడిపై వచ్చే లాభం కంటే పెట్టిన అసలు ఎంత త్వరగా మన చేతికి తిరిగి వస్తుంది అనేదే అతి ముఖ్యం’ అని నేర్పించారు.

ధనికులు ఆడే అసలు ఆట ఇదే!

డబ్బు కేవలం పన్నుల మినహాయింపులకు లేదా జీతం కోతలకే పరిమితం కాకూడదు. నిజమైన నగదు మీ జేబులోకి తిరిగి రావాలి. ఏదైనా వ్యాపారంలో లేదా ఆస్తిలో పెట్టిన మీ అసలు మూలధనాన్ని వీలైనంత త్వరగా వెనక్కి తెచ్చుకోండి. అదే సమయంలో ఆ ఆస్తిపై మీ హక్కును వదులుకోకండి. వెనక్కి వచ్చిన ఆ డబ్బును మరొక కొత్త ఆస్తిని కొనడానికి వెచ్చించండి.

‘ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా బ్యాంకు ఖాతాల్లో ఉన్న మీ డబ్బు విలువ తగ్గిపోతూనే ఉంటుంది. కాబట్టి గుడ్డిగా బ్యాంకు పొదుపుపై ఆధారపడటం మాని, ఆదాయాన్ని ఇచ్చే నిజమైన ఆస్తులను సృష్టించడం ప్రారంభించండి’ అంటూ రాబర్ట్‌ కియోసాకి తెలిపారు.

ఇదీ చదవండి: భారత్‌లో 1500 శాతం పెరిగిన గోల్డ్‌ స్మగ్లింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement