ఫ్రాన్స్ దేశంలోని పలు ప్రాంతీయ బ్లడ్ బ్యాంకులు లక్ష్యంగా చేసుకుని ఇటీవల సైబర్ దాడి జరిగింది. నవంబర్ 2న జరిగిన ఈ దాడికి సంబంధించి ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఈఎఫ్‌ఎస్) అధికారిక వివరాలను వెల్లడించాయి. అయితే, అధికారులు సకాలంలో స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని, బ్లడ్ ప్రొడక్ట్‌లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశాయి.
అసలు దాడి ఎలా జరిగింది?
అధికారిక సమాచారం ప్రకారం, ఈ సైబర్ దాడి బ్లడ్ స్టోరేజీలు, ప్లాస్మా భద్రపరిచే శీతలీకరణ (కోల్డ్-స్టోరేజ్) పరికరాల సరఫరా వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. హ్యాకర్లు రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్‌ను నియంత్రించి ఉష్ణోగ్రతలను ప్రమాదకర స్థాయిలో విపరీతంగా పెంచేందుకు కుట్ర పన్నారు. ఒకవేళ ఈ కుట్ర విజయవంతమైతే బ్లడ్ బ్యాంక్స్‌లో నిల్వ ఉంచిన విలువైన రక్తం, ప్లాస్మా, రక్త నమూనాలు పూర్తిగా పాడైపోయేవి. నిపుణులు, సంబంధిత టెక్నికల్ టీమ్స్ అప్రమత్తమై వెంటనే అడ్డుకోవడంతో ఈ దురాగతం భగ్నమైంది. రక్త ఉత్పత్తులు, నమూనాలు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు.
అంతరాయం లేని వైద్య సేవలు
ఈ సైబర్ దాడి ఘటనపై ఫ్రాన్స్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రక్త సేకరణ, పంపిణీ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయని ఈఎఫ్‌ఎస్ స్పష్టం చేసింది. ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రోగులకు అందాల్సిన అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ముప్పు లేదని ప్రజలకు భరోసా కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యవసర మౌలిక సదుపాయాలు, హెల్త్‌కేర్ సెక్టార్‌లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లో బ్లడ్ బ్యాంకులపై జరిగిన ఈ తాజా దాడి వైద్య రంగంలోని సైబర్ భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌లో 1500 శాతం పెరిగిన గోల్డ్ స్మగ్లింగ్


