క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో.. భారీ సైబర్ దాడి కలకలం రేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ సంస్థ బినాన్స్‌పై జరిగిన ఈ దాడిలో 6.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.55 వేల కోట్ల) విలువైన డిజిటల్ ఆస్తులు ప్రభావితమయ్యాయి. ఈ ఘటనను క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద హ్యాకింగ్‌గా పేర్కొంటున్నారు. అయితే, ఈ మొత్తం డబ్బు హ్యాకర్ల చేతికి వెళ్లలేదు. దాడితో ప్రభావితమైన ఆస్తుల్లో దాదాపు సగం మొత్తాన్ని ఇతర క్రిప్టో సంస్థల సాయంతో నిలిపివేసినట్లు బినాన్స్ తెలిపింది. నష్టపోయిన వినియోగదారులకు తామే పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది.
ప్రాథమిక విచారణ ప్రకారం.. బినాన్స్ ఇంజినీర్‌కు చెందిన ల్యాప్‌టాప్.. హ్యాకర్ల చేతికి చిక్కడం ఈ దాడికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో దుండగులు అనధికారికంగా డిజిటల్ ఆస్తులను విత్‌డ్రా చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ దాడిలో హ్యాకర్ల చేతిలోకి వెళ్లిన ఆస్తుల్లో కొంత మొత్తం ఇంకా వారి వద్దే ఉండటంతో వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ సైబర్ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన ‘ట్రేడర్‌ట్రెయిటర్’ అనే హ్యాకింగ్ బృందం ఉన్నట్లు టీఆర్‌ఎం ల్యాబ్స్, చైన్‌అనాలిసిస్ సంస్థలు అనుమానిస్తున్నాయి. 2025లో బైబిట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌పై జరిగిన 1.5 బిలియన్ డాలర్ల (150 కోట్ల డాలర్లు) హ్యాకింగ్ ఘటనతో ప్రస్తుత దాడికి కొన్ని పోలికలు ఉన్నాయని టీఆర్‌ఎం ల్యాబ్స్ తెలిపింది. ఈ సంస్థ గ్లోబల్ పాలసీ హెడ్ ఆరి రెడ్‌బోర్డ్ దీనిని క్రిప్టో పరిశ్రమలో కీలక మలుపుగా పేర్కొన్నారు.
మరోవైపు బినాన్స్‌కు సహకారంగా టెథర్, సర్కిల్ సంస్థలు సుమారు 2.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21 వేల కోట్లు) విలువైన ఆస్తులను నిలిపివేశాయి. ఇందులో సర్కిల్ 800 మిలియన్ డాలర్లకు పైగా, టెథర్ 1.6 బిలియన్ డాలర్ల (160 కోట్ల డాలర్లు) ఆస్తులను ఫ్రీజ్ చేశాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సంబంధం ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ కూడా హ్యాకర్లు దొంగిలించిన డబ్బును నిలిపివేయడానికి సహకరించినట్లు తెలిపింది.
అలాగే భద్రతపై స్పష్టత వచ్చే వరకు.. బినాన్స్ విత్‌డ్రాలను నిలిపివేసింది. బినాన్స్ సహ సీఈఓ యి హే ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, అమెరికా వినియోగదారులకు సేవలందించే బినాన్స్, యూఎస్ ఈ ఘటనతో ప్రభావితం కాలేదని స్పష్టం చేసింది. మరో క్రిప్టో సంస్థ కాయిన్‌బేస్ కూడా తమ ప్లాట్‌ఫామ్ సురక్షితంగానే ఉందని తెలిపింది.
కాగా, ఈ హ్యాకింగ్ వార్తలతో క్రిప్టో మార్కెట్‌లో భారీ కుదుపు చోటుచేసుకుంది. బిట్‌కాయిన్ ధర 4 శాతానికి పైగా పడిపోగా, ఎథీరియం, సోలానా వంటి ప్రధాన క్రిప్టో కరెన్సీల ధరలు కూడా తగ్గాయి. 2017లో ప్రారంభమైన బినాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా నమోదైన వినియోగదారులు ఉన్నారు. ఇంతటి భారీ సంస్థపై సైబర్ దాడి జరగడంతో క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.
ఇదీ చదవండి: Stock Market Updates: స్థిరంగా స్టాక్ మార్కెట్ సూచీలు


