ఫ్రాన్స్‌లో మరోసారి నిరసనలు ఉధృతమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు (శనివారం) పారిస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో 70 వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విధ్వంసం, దోపిడీలు, హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ హెచ్చరించారు.
పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, సిబ్బంది కొరతను పరిష్కరించాలని విద్యార్థులు తొలుత ఆందోళనలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, క్రమంగా ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరగడం, భవిష్యత్తులో ప్రభుత్వ ఖర్చులు తగ్గించే అవకాశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయని చెప్పారు. దీంతో విద్యార్థులు, కార్మిక సంఘాలతో పాటు ఇతర ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు కూడా నిరసనలకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.
అయితే, నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు అధికారులు స్పష్ట చేశారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్వహించే ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రకటించారు. లియోన్, నీస్, మాంట్‌పెల్లియర్ వంటి నగరాల్లో బహిరంగ సమావేశాలపై నిషేధం విధించినప్పటికీ, దేశవ్యాప్తంగా వందలాది నిరసన కార్యక్రమాలకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
పారిస్‌లోని లూవ్రే, ఓర్సే, పికాసో మ్యూజియంలను మూసివేయడంతో పాటు పీఎస్‌జీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. గతవారం జరిగిన అల్లర్లలో పలు దుకాణాలు లూటీ అయ్యాయని, భవనాలకు నిప్పంటించారని అధికారులు తెలిపారు. అలాగే, లిమోజ్ నగరంలోని పురాతన టౌన్‌హాల్ కూడా దగ్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ అల్లర్లకు సంబంధించి 232 మందిని జైలుకు పంపినట్లు న్యాయశాఖ మంత్రి జెరాల్డ్ డార్మనిన్ తెలిపారు. మరో 1,100 మందికి పైగా కోర్టు విచారణను ఎదుర్కొన్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం విద్యార్థి ప్రతినిధులతో సమావేశమైనట్లు ఆయన సలహాదారులు తెలిపారు. పాఠశాల విద్యను మెరుగుపరిచేందుకు ఇకపై పలు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని విద్యార్థులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, మరోవైపు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఉద్యమించిన ‘ఎల్లో వెస్ట్స్’ బృందం కూడా నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో మాక్రాన్ రాజీనామా చేయాలని ఈ బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో రాజకీయ విభేదాలు కూడా ఆందోళనలకు కారణమవుతున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మాక్రాన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాజకీయంగా మార్పు చోటుచేసుకోగా, అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్ష, కుడిపక్ష పార్టీల నేతలు విమర్శించసాగాయి. మరోవైపు, ఓర్లియాన్స్ నగరంలో కుడిపక్ష నేషనల్ ర్యాలీ పార్టీ సమావేశం జరగనుండటంతో అక్కడ ఘర్షణలు తలెత్తకుండా వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు ఏ స్థాయికి చేరతాయన్నది ఉత్కంఠగా మారింది.
ఇదీ చదవండి: వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్


