ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయం ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత వ్యూహాత్మక వాటా విక్రయం తదుపరి ఐడీబీఐ బ్యాంక్‌లో అటు ప్రభుత్వం, ఇటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) పబ్లిక్ వాటాదారులుగా నిలవనున్నాయి. ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం అమ్మివేసేందుకు గత వారం ప్రభుత్వం అనుమతించింది.
డీల్ విలువ రూ. 53,000 కోట్లుకాగా.. దీంతో ప్రభుత్వంతోపాటు, ఎల్‌ఐసీ వాటా బ్యాంక్‌లో 15 శాతం పరిమితికి లోబడవలసి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్ బోర్డులో ఎలాంటి ప్రాతినిధ్యానికీ వీలుండదు. వెరసి పబ్లిక్ వాటాదారులుగా అవతరించనున్నట్లు దీపమ్ కార్యదర్శి అరునిష్ చావ్లా తాజాగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ వ్యూహాత్మక పునర్‌వ్యవస్థీకరణ తదుపరి నిర్వహణ, అవసరమైనప్పుడు పెట్టుబడి తదితర బాధ్యతలు ఫెయిర్‌ఫాక్స్ చేపట్టనున్నట్లు తెలియజేశారు.
పబ్లిక్‌కు మరింత వాటా
ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం, ఎల్‌ఐసీ పబ్లిక్ వాటాదారులుగా అవతరించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చావ్లా వెల్లడించారు. దీంతో 15 శాతం వాటా మించి కలిగి ఉండటానికి అవకాశముండదు. ఇదేవిధంగా బోర్డులో పదవులకూ వీలుండదు. అయితే మరోవైపు ప్రమోటర్‌గా బ్యాంక్ కంటింజెంట్ లయబిలిటీ కొనసాగనుంది. ఇప్పటికే బ్యాంక్‌లో వాటాను 19 శాతం నుంచి 15 శాతానికి తగ్గించుకోమంటూ ఎల్‌ఐసీని సెబీ ఆదేశించినట్లు చావ్లా తెలియజేశారు. తద్వారా బ్యాంక్‌లో పబ్లిక్ వాటా పెరిగి మరింతమంది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడికి దారి ఏర్పడనుంది.
ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం నుంచి 30.48 శాతం, ఎల్‌ఐసీ నుంచి 30.24 శాతం చొప్పున వాటా ఫెయిర్‌ఫాక్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 81 చొప్పున విడిగా రూ. 26,620 కోట్లు, రూ. 26,440 కోట్లు చొప్పున చెల్లించనుంది. ఈ ఏడాది ముగిసే(మార్చి)లోగా వాటా విక్రయ లావాదేవీ పూర్తికావచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 343 కిమీ రేంజ్.. కొత్త బైక్ లాంచ్!


