కార్ల ప్రియులకు పండుగే.. 2027లో లాంచ్ అయ్యే కొత్త కార్లు! | Bharat Mobility Expo 2027 Dates Confirmed, Check The Upcoming Cars Expected To Make Their Debut, Know More Details | Sakshi
Sakshi News home page

Bharat Mobility Expo 2027: వచ్చే ఏడాది లాంచ్ అయ్యే కొత్త కార్లు!

Oct 30 2026 11:32 AM | Updated on Oct 30 2026 12:11 PM

Bharat Mobility Expo 2027 Dates Confirmed And Know The Upcoming Cars

కొత్త సంవత్సరం వస్తుందంటే.. ఆటోమొబైల్ రంగంలో కొత్త మార్పులు కనిపిస్తుంటాయి. కార్ల తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడంతో పాటు.. భవిష్యత్తులో రాబోయే కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసేందుకు సిద్ధమవుతుంటాయి. అలాంటి కొత్త వాహనాల సందడికి వేదిక కానుంది 2027 భారత్ మొబిలిటీ ఎక్స్‌పో.

గతంలో ఆటో ఎక్స్‌పోగా పిలిచిన ఈ కార్యక్రమాన్ని.. ఇప్పుడు భారత్ మొబిలిటీ ఎక్స్‌పో పేరుతో నిర్వహిస్తున్నారు. 2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న భారత్ మండపంలో ఈ ఎక్స్‌పో జరగనుంది. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మీడియా కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది.

ఈసారి ఎక్స్‌పోలో చాలా ప్రముఖ కార్ల కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా, టయోటా, కియా, హోండా, ఎంజీ, రెనాల్ట్ వంటి కంపెనీలతో పాటు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ, విన్​ఫాస్ట్, జీప్, సిట్రోయెన్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు కూడా తమ కొత్త వాహనాలను ప్రదర్శించవచ్చని అంచనా.

ఇక ఈ ఎక్స్‌పోలో ఏయే కార్లు కనిపించబోతున్నాయనే విషయానికి వస్తే.. మారుతి సుజుకి నుంచి వైఎంసీ ఎలక్ట్రిక్ ఎంపీవీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హ్యుందాయ్ నుంచి కొత్త జనరేషన్ క్రెటా, నైరా, సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్లు రానున్నట్లు సమాచారం. టయోటా విషయానికి వస్తే ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్, టైసర్ ఫేస్‌లిఫ్ట్ సందర్శకుల దృష్టిని ఆకర్షించవచ్చు.

కియా నుంచి కొత్త సోనెట్ వచ్చే అవకాశం ఉండగా.. రెనాల్ట్ తన బ్రిడ్జర్, బిగ్‌స్టర్ మోడళ్లను ప్రదర్శించవచ్చని తెలుస్తోంది. మహీంద్రా కూడా ఈసారి తన కాన్సెప్ట్ కార్లతో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. విజన్ ఎస్, విజన్ టీ, బీఈ.07 వంటి మోడళ్లను ప్రదర్శించవచ్చని అంచనా. అయితే ఏ కంపెనీ.. ఏ కారును లాంచ్ చేస్తుందనే విషయం మాత్రం త్వరలోనే తెలుస్తుంది.

ఇదీ చదవండి: దేశం దాటిన 50వేల ఎలక్ట్రిక్ కార్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement