పెట్టుబడులకు రెట్టింపు భరోసా | CM Revanth Reddy to visit Delhi for Invest Telangana | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు రెట్టింపు భరోసా

Oct 30 2026 4:30 AM | Updated on Oct 30 2026 4:31 AM

CM Revanth Reddy to visit Delhi for Invest Telangana

గ్లోబల్‌ సమ్మిట్‌ కర్టెన్‌రైజర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్, పారిశ్రామికవేత్త జీఎంఆర్‌ తదితరులు

రెండింతల లాభాల కోసం మీకేం కావాలో అడగండి 

మీకు అవసరమైన మద్దతు అందించే బాధ్యత నాది 

ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి

అభివృద్ధి విషయంలో అవసరమైన చోట ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తామని హామీ

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపు 

విధానపరమైన సూచనలు చేయాలని విజ్ఞప్తి 

తెలంగాణకు కేంద్రం అన్నివిధాలా సహకరిస్తోందన్న సీఎం 

తెలంగాణ విజయగాథలో కేంద్ర ప్రభుత్వమూ భాగస్వామే: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌  

హస్తినలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ కర్టెన్‌ రైజర్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఎంత పెట్టుబడి పెట్టినా అది
రెండింతలు వృద్ధి చెందేలా భరోసా ఇవ్వడమే కాకుండా ఆ పెట్టుబడులకు సంరక్షణనూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘మీరు తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ముందుగా  మీ మనసులో ఒక సంఖ్యను నిర్ణయించుకోండి. ఆ మొత్తాన్ని ఇప్పుడు రెట్టింపు చేయండి. మీరు ఆశిస్తున్న వృద్ధి అంచనాలను రెట్టింపు చేయండి. మీరు ఆశిస్తున్న లాభాలనూ రెట్టింపు చేయండి. 

అందుకు నా నుంచి మీకు ఏం కావాలో  చెప్పండి. విధానపరమైన నిర్ణయాలైనా, ప్రభుత్వ సహకారమైనా.. మీకు అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటా..’ అని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 7వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’కు స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు హాజరుకావాలని ఆహ్వానించారు. సదస్సు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఢిల్లీలో సదస్సు’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడారు. 

కేంద్రంతో సంబంధాలపై సందేహాలొద్దు 
    ‘పెట్టుబడిదారుల్లో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై సందేహాలున్నాయి. అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్వయంగా చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. దేశంలో ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వాటిలో మూడు హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరిస్తోంది. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్‌ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు కేంద్రం నుంచి సహకారం పొందుతున్నాం.  

అడ్డంకులను తొలగించడమే పని... 
    అభివృద్ధి విషయంలో అవసరమైన చోట ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరిస్తాం. వారి విజయపథంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడమే మా పని. హైదరాబాద్‌ ఇకపై ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో  పోటీ పడదు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్‌ వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడేలా మారాలి. పారిశ్రామికవేత్తలు, విదేశీ దౌత్యవేత్తలు, కంపెనీల ప్రతినిధులు అంతటి అభివృద్ధికి అవసరమైన అత్యుత్తమ ఆలోచనలను అందించాలి. మంచి విధానపరమైన సూచనలు చేయాలి..’ అని సీఎం కోరారు. 

అది హైదరాబాద్‌ డీఎన్‌ఏలోనే ఉంది.. 
    ‘హైదరాబాద్‌ సుమారు 400 ఏళ్ల క్రితమే ఒక ప్రపంచ స్థాయి నగరంగా వెలుగులీనింది. అనేక దేశాల నుంచి వ్యాపారులు చార్మీనార్‌ పరిసరాలకు వచ్చి వ్యాపారాలు చేసేవారు. ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి నకాషీ కళావృతులను కొనుగోలు చేసేవారు. నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంకశాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రపంచం గర్వించే మేధో నిపుణులు, నాయకులను అందించింది. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్, ప్రేమ్‌ వత్స వంటి ప్రముఖులంతా హెచ్‌పీఎస్‌లోనే చదువుకున్నారు. 

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడం హైదరాబాద్‌ డీఎన్‌ఏలోనే ఉంది. అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్‌గాం«దీ.. హైదరాబాద్‌లోనే పైలట్‌ శిక్షణ పొందారు. అందుకే హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు తెలంగాణకు చెందినవారని చెప్పడానికి గరి్వస్తున్నాం. తర్వాత వేర్వేరు పార్టీలు అధికారంలోకి వచి్చనప్పటికీ హైదరాబాద్‌ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారు..’ అని రేవంత్‌ చెప్పారు. 

తెలుగు వారి విజయగాథలెన్నో : పీయూష్‌ గోయల్‌ 
    ప్రపంచ వాణిజ్యంలో తెలుగు నేల, తెలుగు వారి విజయగాథలెన్నో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. 700 ఏళ్ల క్రితమే కాకతీయ గణపతి చక్రవర్తి నౌకా వాణిజ్యంపై మోటుపల్లి శాసనం వేయించారని గుర్తుచేశారు.

 నాడే వ్యాపారులు తమ పెట్టుబడులకు భద్రత, విధాన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కోరుకున్నారని, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా అవే కోరుకుంటున్నారని చెప్పారు. వికసిత్‌ భారత్‌ సాధించాలంటే రాష్ట్రాలన్నీ అన్ని రంగాల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాలకు ఎగుమతులు పెంచామని, ఇటీవలే ఏఐ ట్యాగ్‌ ఉన్న తాండూరు కందులు ఆ్రస్టేలియాకు పంపించామని చెప్పారు. తెలంగాణ విజయగాథలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు.  

ఐఎస్‌ఎమ్‌ 2.0లో భాగస్వామ్యం చేయండి: శ్రీధర్‌బాబు 
    సెమీ కండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం) 2.0లో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని కోరారు. తద్వారా ఫ్యాబ్‌ ఇండస్ట్రీ, చిప్‌ డిజైన్‌ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 2030 నాటికి 5 గిగావాట్లకు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. 

రాష్ట్ర మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ఎంపీలు అభిõÙక్‌ మను సింఘ్వీ, డాక్టర్‌ మల్లు రవి, వేం నరేందర్‌ రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, సురేష్‌ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, పలువురు పారిశ్రామికవేత్తలు, విదేశీ దౌత్యవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

హైలైట్‌ చేయడం కోసం అడ్డంకులను తొలగించడమే పని పేరాలో.. 
– పారిశ్రామికవేత్తలు, విదేశీ దౌత్యవేత్తలు, కంపెనీల ప్రతినిధులు అంతటి అభివృద్ధికి అవసరమైన అత్యుత్తమ ఆలోచనలను అందించాలి. మంచి విధానపరమైన సూచనలు చేయాలి. 

అది హైదరాబాద్‌ డీఎన్‌లోనే ఉంది..పేరాలో 
– విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడం హైదరాబాద్‌ డీఎన్‌ఏలోనే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement