తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. సీఎం రేవంత్ | Revanth Reddy calls on industrialists to become part of Telangana Rising 2047 | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. సీఎం రేవంత్

Oct 29 2026 10:16 PM | Updated on Oct 29 2026 10:17 PM

Revanth Reddy calls on industrialists to become part of Telangana Rising 2047

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తెలంగాణ‌
పెట్టుబడులకు, పెట్టుబ‌డిదారుల‌కు నాది భరోసా 
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి* 
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఆహ్వానం

సాక్షి, ఢిల్లీ:  తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను  సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు త‌మ ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని, రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడికి త‌న‌ది భ‌రోసా అని సీఎం హామీ ఇచ్చారు. హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాన్ని ఈ రోజు (గురువారం) ఢిల్లీలో నిర్వ‌హించారు.

ఈ స‌న్నాహ‌క కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంత‌ర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు నాలుగు వందల ఏళ్ల క్రితమే ప్రపంచ నగరంగా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. ప్రపంచీకరణ అనే మాట ప్రాచుర్యంలోకి రాకముందే అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారాలు చేసేవారని తెలిపారు. చార్మినార్ పరిసరాల్లో ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, న‌ఖాసీ వస్తువుల వ్యాపారం జరిగేదని గుర్తు చేశారు.

నిజాం పాలనలో హైదరాబాద్‌లో అనేక చారిత్రక కట్టడాలు, అంతర్జాతీయ స్థాయి మ్యూజియాలు, టంక‌శాల‌, విమానాశ్రయం, రైల్వే వ్యవస్థ, విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని సీఎం తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), అజయ్ బంగా (ప్రపంచ బ్యాంకు), శంతను నారాయణ్ (అడోబ్), ప్రేమ్ వత్స వంటి వారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను అందించడంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు సీఎం తెలిపారు.

పెట్టుబడులు రెట్టింపు చేయండి...
మీ ఎదుట సుదీర్ఘ ప్రసంగం చేయడానికి తాను రాలేద‌ని, మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చానని అంత‌ర్జాయ‌తీ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యాపార, వాణిజ్య రంగంలో పారిశ్రామికవేత్తలకు తమకంటే ఎక్కువ అనుభవం ఉందని, వారి నుంచి నేర్చుకుని, సూచనలను అర్థం చేసుకుని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడి మొత్తాన్ని, వ్యాపార వృద్ధిని, లాభాల అంచనాలను రెట్టింపు చేయాల‌ని కోరారు. పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల తెలంగాణ
‘తెలంగాణ రైజింగ్‌–2047’ లక్ష్యం వికసిత్ భారత్‌-2047 దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వివ‌రించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం ప్రకటించారు.

కేంద్రంతో కలిసి రాష్ట్రాభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పెట్టుబడిదారులకు సందేహాలు ఉండొచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకావడమే ఇందుకు నిదర్శనమని సీఎం తెలిపారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించగా, వాటిలో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెకు మూడు కారిడార్లు కేటాయించారని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా కేంద్రం సహకరిస్తోందన్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, నేవీ లో-ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం నుంచి సహకారం అందుతోందని సీఎం తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజాసేవ విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి విష‌యంలో ప్రభుత్వ అతి జోక్యానికి బ‌దులు సమర్థ పాలన అవసరమని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలు విజయాలు సాధించే మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే తన బాధ్యతని తెలిపారు. హైదరాబాద్ పోటీ ఢిల్లీ, ముంబ‌యి, చెన్నై, బెంగళూరు నగరాలతో కాద‌ని,  న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి ప్రపంచ నగరాలతోనేనని సీఎం అన్నారు.

ఈ కార్యక్రమంలో  కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంక‌ట‌స్వామి, అంత‌ర్జాతీయ స్థాయి పారిశ్రామిక‌వేత్త‌లు, విధాన నిర్ణేతలు ఎంపీలు అభిషేక్ మ‌ను సింఘ్వీ, రేణుకా చౌద‌రి, డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, వేం న‌రేంద‌ర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, బ‌ల‌రాం నాయ‌క్‌, సురేశ్ షెట్కార్‌, రామ‌ స‌హాయం ర‌ఘురాంరెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు, ఉన్న‌తాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement