సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్నారని, మరి అలాంటప్పుడు మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నారని కేటీఆర్ నిలదీశారు.
ప్రచార ఆర్భాటాలు మాని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో కుదేలైందని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది కాలం తెచ్చిన కరువు కాదని, అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, మరోవైపు హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, మూసీ సుందరీకరణ పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రైలు ప్రమాదంపై భగ్గుమన్న ప్రజలు.. రవాణా మంత్రికి వ్యతిరేకంగా నిరసనలు


