మరణం.. ఎంత కఠినం! బైక్‌పైనే కుప్పకూలి మెకానిక్ మృతి | Jangaon Man Dies Of Heart Attack On Flyover While Returning Home On Scooter, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మరణం.. ఎంత కఠినం! బైక్‌పైనే కుప్పకూలి మెకానిక్ మృతి

Oct 29 2026 11:41 AM | Updated on Oct 29 2026 12:57 PM

 Motor Mechanic Heart attack In Janagama

జనగామ: గుండెపోటు రూపంలో మృత్యువు కబళించడంతో ఓ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. పట్టణంలోని సిద్దిపేట రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై బుధవారం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి గ్రామానికి చెందిన బోడ లింగయ్య (51) కొన్నేళ్లుగా బచ్చన్నపేటలో మోటార్‌ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 

లింగయ్య ఎప్పటిలాగే బుధవారం మోటార్‌ పంపు కొనుగోలు చేసేందుకు జనగామకు వచ్చాడు. ఓ దుకాణంలో అవసరమైన వస్తువు కొనుగోలు చేసి స్కూటీపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో పట్టణంలోని బ్రిడ్జిపైకి చేరుకోగానే అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి వాహనదారులు ఆయనకు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లింగయ్యను జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా స్నేహితులు, రైతులు, పలువురు వ్యాపారులు అధిక సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోయిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement