సమావేశంలో మాట్లాడుతున్న వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి. చిత్రంలో తులసిచందు, రిటైర్డ్ ఐపీఎస్ హనుమంతరెడ్డి, ప్రొఫెసర్ ఎన్. రాజశేఖర్ రెడ్డి
స్థానిక ఎన్నికలను ప్రహసనంగా మార్చేసిన బాబు సర్కార్
ఓపెన్ మైండ్స్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావుల ఆవేదన
ప్రజాస్వామ్య పరిరక్షణకు సమన్వయ పోరాటానికి పిలుపు
హైదరాబాద్, లక్డీకాపూల్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, భవిష్యత్తులో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు మేధావులు, జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చేసిందని వారు విమర్శించారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు, అక్రమాల నేపథ్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వైఫల్యం–ప్రజాస్వామ్య పరిరక్షణ’ అన్న అంశంపై ‘ఓపెన్ మైండ్స్ ఫోరం’ బుధవారం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఫోరం ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎన్. రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన ఈ సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏ. హనుమంతరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, విజయబాబు, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి, రాజకీయ విశ్లేషకులు, సీఏ నాగార్జున రెడ్డి, నవోరోజిరెడ్డి, ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై వక్తలు సుదీర్ఘంగా చర్చించారు. ‘నేరమే అధికారమై ఏపీలో ఊరేగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా తుంగలో తొక్కారు.
అధికార పక్షం అక్రమాలకు, హింసకు పాల్పడుతూ ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఓటుకు గౌరవ, మర్యాదలు లేకుండా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులు, బెదిరింపుల వల్ల సామాన్య ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నత న్యాయస్థానాల తీర్పులను సైతం లెక్కచేయని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనడం దారుణం. ఇలాంటి హింసాత్మక రాజకీయాలు, ఎన్నికల అక్రమాలు కొనసాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఉనికే ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు మేధావులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ అంశంపై జెన్‌జీ స్పందించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
అధికారం కోసం విధ్వంసం
ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచించే తత్వం ప్రభుత్వానికి లేకుండా పోయింది. స్వార్థం కోసం పని చేస్తున్న ప్రభుత్వ వైఖరితో ఏపీ ప్రమాదకరమైన స్థితిలో ఉంది. రాజకీయాలకే స్ఫూర్తినిచ్చిన వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులను చూశాం. కానీ ప్రస్తుతం అధికారంలో ఎప్పటికీ తామే ఉండాలన్న కుటిల వైఖరితో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఎలా కోట్లు సంపాదించాలన్నదే తప్ప.. ప్రజలకు ఎలా సేవలందించాలన్న ఆలోచనే లేదు.
– వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్
ఇదీ చదవండి: ఆ జిల్లాలకు 30 వరకు కరెంట్ ఇవ్వలేం


