సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(గురువారం) సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుపాను అనంతర పరిస్థితులు, స్థానిక సంస్థ ఎన్నికల అంశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలపై జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా, వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది. రెండు రోజుల(మంగళ,బుధ) పర్యటనలో భాగంగా తొలిరోజు మంగళవారం ఉదయం పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో పులివెందుల నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను తూర్పారబట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. టీడీపీ నేతలకు ఆయన విసిరిన సవాల్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది.
బుధవారం ఉదయం పులివెందుల నుంచి బెంగుళూరుకు బయలుదేరుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన గండికోట పవన్‌కుమార్ కలిశారు. ఈనెల 17న పులివెందుల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిపిన లాఠీఛార్జి, భాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు, ఏకే 47 కాల్పులలో పవన్‌కుమార్ కాలికి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తనకు తగిలిన గాయం గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. స్పందించిన ఆయన ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: అమ్ముడుపోయిన అధికారం!


