గిడ్డి ఈశ్వరి కుమార్తె కీర్తి మధుమిత
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు జెడ్పీటీసీ స్థానాన్ని తన కుమార్తెకు ఇప్పించి, జడ్పీ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవాలనుకున్న మాజీ ఎమ్మెల్యే, పాడేరు టీడీపీ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఆశలు నెరవేరలేదు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పెద్దల వద్ద చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమెకు నిరాశ ఎదురైంది.తన కుమార్తె కీర్తి మధుమితను పాడేరు జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావించిన గిడ్డి ఈశ్వరి.. నామినేషన్ కార్యక్రమాన్ని పాడేరులో అట్టహాసంగా నిర్వహించారు. ముందు జాగ్రత్తగా నామినేషన్ల చివరి రోజున తాను కూడా పాడేరు జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం రూ.లక్షలు వెచ్చించి ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు.అయితే, ఇదే స్థానానికి కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఇద్దరేసి అభ్య ర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పరి స్థితి మారింది. తన కుమార్తె టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్థానంలోనే బీజేపీ, జనసేన అభ్యర్థులు బరిలోకి దిగడంతో ఈశ్వరిలో ఆందోళన మొదలైంది. తన కుమార్తెకు టీడీపీ నుంచి బీ–ఫారం వస్తుందనే ఆశతో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, ఇతర టీడీపీ ముఖ్య నేతలను ఆమె అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. బీజేపీ, జనసేన నేతలను సైతం కలిసి తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరినట్లు ప్రచారం జరిగింది.
నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి బీ–ఫారం అందజేయడానికి గడువు ముగిసిన మంగళవారం వరకు గిడ్డి ఈశ్వరి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ తన కుమార్తెకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితి ఆమెకు ఎదురైంది. చివరకు పాడేరు జెడ్పీటీసీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి నందోలి ఉమామహేశ్ దక్కించుకున్నారు. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ పాడేరు జెడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో గిడ్డి ఈశ్వరి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: శ్రీలంక పౌరురాలికి మున్సిపల్ చైర్‌పర్సన్ టికెట్టా?


