సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరానికి మరో ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని.. రేపటికి వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఇవాళ కూడా(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తడిసి ముద్దయిన ఉత్తరాంధ్రపై మరోసారి కుండపోత కురిస్తే వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉంది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి.
గురువారం కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: ‘అర్నబ్’ విలయం..కోస్తా కకావికలం


