‘అర్నబ్‌’ విలయం..కోస్తా కకావికలం | Cyclone Arnab Threatens Coastal Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘అర్నబ్‌’ విలయం..కోస్తా కకావికలం

Oct 29 2026 6:03 AM | Updated on Oct 29 2026 6:03 AM

Cyclone Arnab Threatens Coastal Andhra Pradesh

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో పెనుగాలులకు నేలకొరిగిన అరటి తోట

అతలాకుతలం చేసిన అతి తీవ్ర తుపాను  

నరసాపురం వద్ద 6 గంటల పాటు ల్యాండ్‌ఫాల్‌ 

150 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు  

గోపాలపట్నంలో ఏకంగా 31.6 సెంటీమీటర్ల వర్షం 

విజయనగరం జిల్లా కొత్తవలసలో 30.6 సెంటీమీటర్ల వర్షం 

108 చోట్ల 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం  

నేలకొరిగిన వేలాది వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు 

ఉప్పాడలో విధ్వంసం.. తీరంలో రోడ్డుపైకి కొట్టుకొచ్చిన బండరాళ్లు  

లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన వరి, అరటి, ఇతర పంటలు 

రైతుల ఆశలు అడియాశలు చేసిన తుపాను 

వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 10 పునరావాస శిబిరాల్లో భోజనం నిల్‌

సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్‌: అర్నబ్‌ అతి తీవ్ర తుపాను కోస్తా తీరాన్ని కకావికలం చేసింది. కుండపోత వర్షాలు, ప్రచండ గాలులతో భీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు తీరం దాటుతూ ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా డెల్టాలను అతలాకుతలం చేసింది. గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు విలయం సృష్టించింది. వేలాది వృక్షాలు, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 15 వేలకుపైగా విద్యుత్‌ స్తంభాలు కుప్పకూలాయి. కోతకొచ్చిన వరి చేలు చెరువులను తలపిస్తున్నాయి. వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.

ఆకాశానికి చిల్లు పడినట్టు ఉత్తరాంధ్రలో కుండపోత కురిసింది. తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మంగళవారం పగలంతా గంటకు 17 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన అర్నబ్, తీరానికి చేరగానే స్తబ్దుగా మారింది.

బుధవారం తెల్లవారుజాము 2 గంటలకు భూమిని తాకడం మొదలుపెట్టి ఉదయం 8 గంటల వరకు తీరంపైనే దాదాపు కదలకుండా నిలిచిపోయింది. రెండు గంటల్లో ముగుస్తుందనుకున్న తీరం దాటే ప్రక్రియ ఆరు గంటల పాటు సాగడంతో గోదావరి తీర గ్రామాలు పెనుగాలుల ధాటికి విలవిల్లాడాయి. యానాం సమీపంలో తీరం దాటుతుందని మొదట అంచనా వేయగా, చివరికి అంతకంటే దక్షిణంగా జరిగి యానాంకు నైరుతి దిశగా, నరసాపురానికి తూర్పు–ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో భూమిని తాకింది.

పెను గాలుల ఉగ్రరూపం
తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు తీరాన్ని అతలాకుతలం చేశాయి. బుధవారం ఉదయం 8.30 గంటలకు తీవ్ర తుపానుగా బలహీనపడిన తర్వాత కూడా అనకాపల్లి, విశాఖ, కాకినాడ, తూ­ర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మధ్యాహ్నం వరకు గంటకు 110 నుంచి 120 కిలో­మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.

రాత్రి వరకూ గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఏలూ­రు, పోలవరం, భద్రాచలం మీదుగా ఉత్తర–వాయవ్యంగా పయనిస్తున్న అర్నబ్, బుధవారం సాయంత్రానికి తుపానుగా, అర్ధరాత్రికి తీవ్ర వాయుగుండంగా, గురువారం ఉదయానికి వాయు గుండంగా మారి, సాయంత్రానికి అల్పపీడనంగా బలహీన పడనుంది. 

ఉత్తరాంధ్రపై జల ఖడ్గం
ఉత్తరాంధ్రపై కుండపోత వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు 24 గంటల్లో విశాఖ జిల్లా గోపాలపట్నం దగ్గర రాష్ట్రంలోనే అత్యధికంగా 31.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో 30.4, గోపాలపట్నం బ్లాక్‌ 22 పంప్‌ హౌస్‌ వద్ద 30, సింహాచలంలో 29.4, అప్పన్నపాలెంలో 29.2, భోగాపురంలో 28.3, పీఎం పాలెం వద్ద 28.1, అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కన్నూరిపాలెంలో 27.5, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 25.8, రణస్థలం మండలం గరికిపాలెంలో 24.3, కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవిలో 22.8, కాకినాడ జిల్లా పిఠాపురంలో 21.1, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 19.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఒకేరోజు రాష్ట్రంలో 108 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వాన కుమ్మరించింది.

అందులో 64 ప్రాంతాలు ఒక్క విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో 19, విజయనగరం జిల్లాలో 17, శ్రీకాకుళం జిల్లాలో 3 చోట్ల ఈ స్థాయిలో వర్షం పడింది. 16 చోట్ల 25 సెంటీమీటర్లు, రెండు చోట్ల 30 సెంటీమీటర్లు దాటింది. పెందుర్తి మండలంలోనే 12 చోట్ల 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. తుపాను తీరం దాటిన నరసాపురంలో కేవలం 3.3 సెంటీమీటర్ల వర్షం కురవగా, దానికి 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని విశాఖపై కుండపోత వర్షం కురిసింది. తీరం దాటిన గోదావరి జిల్లాల్లో మాత్రం ఒక్కచోట కూడా 20 సెంటీమీటర్ల వర్షం నమోదు కాలేదు.

ఎనిమిది మంది ప్రాణాలు బలి
తుపాను ఎనిమిది మందిని పొట్టనబెట్టుకుంది. భీమవరంలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న చొక్కా కిశోర్‌ (46)పై భారీ వృక్షం కూలడంతో మృతి చెందాడు. ఇదే ఊళ్లోని బొండాడవారి వీధిలో మోపెడ్‌పై వెళ్తున్న పేపర్‌ బాయ్‌ రాంబాబు (34)పై విద్యుత్‌ స్తంభం కూలడంతో మృత్యువాతపడ్డాడు. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం ప్రకాశపురంలో పెనుగాలులకు పూరిల్లు కుప్పకూలి వృద్ధురాలు కొల్లు వెంకాయమ్మ (70) ప్రాణాలు కోల్పోయింది. 

విశాఖ నగరంలో తెగిపడిన తీగ తగిలి పిన్ని దేవుడు (65), పాత గోశాల సమీపంలో విద్యుత్‌ స్తంభం కూలిపోయి బిందు.. బాలాజీనగర్‌లో విద్యుత్‌ స్తంభం కూలి మాధవి (43) అనే మహిళ తన పుట్టిన రోజునే మృతి చెందింది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఇంటి ముందు తెగిపడిన విద్యుత్‌ తీగను తాకి భాగ్యలక్ష్మి (55) విద్యుదాఘాతా­నికి బలైంది. తూర్పు గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన కొవ్వాడ నగేష్‌(45) చెట్టు కూలిపడి మృతి చెందాడు. 

చీకట్లో కోనసీమ
కోనసీమ జిల్లాను అర్నబ్‌ కుదిపేసింది. ఒక్క ఈ జిల్లాలోనే సుమారు 6 వేలకు పైగా విద్యుత్‌ స్తంభాలు కుప్పకూలాయి. అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేని­కో­న, ఐ.పోలవరం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. కరెంటు లేక తాగునీటి సరఫరా కూడా నిలిచి పోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులతో జనం అవస్థలు పడుతున్నారు.

రాజోలు–అమలాపురం రహదారిపై రెండు కిలోమీటర్ల మేర చెట్లు అడ్డంగా పడి రాకపోకలు స్తంభించాయి. కాకినాడ జిల్లాలో వందలాది చెట్లు, సుమారు వంద విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఉప్పాడ బీచ్‌ రోడ్డు అలల ధాటికి ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పెనుగొండ, పాలకొల్లు ప్రాంతాల్లో ఇళ్లపై చెట్లు కూలాయి. రాష్ట్ర రహదారులపైనే వందలాది భారీ వృక్షాలు కూలాయి.

ఉప్పొంగిన నదులు.. నీట మునిగిన పడవలు 
కుండపోతకు విశాఖ నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. విజయనగరం జిల్లాలో సువర్ణముఖి, గోస్తని, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాలూరు బస్టాండ్‌ చెరువులా మారింది. భూపతిపాలెం, వట్టిగెడ్డ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అల్లూరి జిల్లా తాడిగూడలో పాత వంతెన కూలి.. ఓ గ్రామం బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయింది. మచిలీపట్నం లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. గుంటూరులో బీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ బస్టాండ్‌ ప్రాంగణం, పీవీకే నాయుడు మార్కెట్‌ జలమయమయ్యాయి. 

పెను గాలులకు ఓ భారీ సరకు రవాణా నౌక కోనసీమ జిల్లా అంతర్వేది తీరానికి కొట్టుకుని వచ్చింది. ఓడలరేవు మినీ హార్బర్‌లో లంగరు వేసిన సుమారు 200 పడవలు అలల తాకిడికి ఒకదానికొకటి ఢీకొని ముక్కలయ్యాయి. ఉప్పాడ, నక్కపల్లిలోనూ పడవలు ధ్వంసమయ్యాయి. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోని సెంట్రల్‌ డాక్‌ ప్రాంతం, జెట్టీ వద్ద లంగరు వేసిన మరబోట్లు మునిగిపోయాయి. 

ఎంఎం 140 బడే సత్యారావు, ఎంఎం 667 కాసారపు మణికంఠ, ఎంఎం 642 ఆర్జుల చిన్ననాయుడు, ఎంఎం 224 ఉమ్మిడి సునీత, ఎంఎం 843 వి.లత, ఎంఎం 888 వాసుపల్లి దాసుకు చెందిన బోట్లు మునిగిపోయాయి. మరో 59 బోట్లు పాక్షికంగా దెబ్బతినగా, 205 వలలు దెబ్బతిన్నాయి. మత్స్యకారులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత, ఈస్ట్‌ కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోటు ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండి­యా జాతీయ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్‌ కోరారు.

కోనసీమ అతలాకుతలం
ఒకవైపు పచ్చని కొబ్బరి తోటలు నేలమట్టం.. మరోవైపు చేతికొచ్చే దశలో వరి చేలు నేలవాలి నీటిమయం.. ఇంకో వైపు గెలలతో సహా విరిగిపడిన అరటి చెట్లు.. ఇలా అర్నబ్‌ తుపాను కోనసీమ రైతుల ఆశలను చిదిమేసింది. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు విద్యుత్‌ వ్యవస్థ, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

లక్ష ఎకరాలకు పైగా వరి పంట తుపాను బారిన పడినట్లు ప్రాథమిక అంచనా. అరటి, కోకో, పోక తదితర ఉద్యాన పంటలకూ నష్టం వాటిల్లింది. సుమారు 8 వేలకుపైగా స్తంభాలు దెబ్బతి­న్నట్లు ప్రాథమిక అంచనా. ఓడలరేవు, అంతర్వేది పరిసరాల్లో బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ ప్రాంతానికి చెందిన సుమారు 40 బోట్లు ఓడలరేవు తీరానికి కొట్టుకొచ్చాయి. తీర, లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 13 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.  

కోతకు గురైన బొర్రా రైలు ట్రాక్‌  
విశాఖ కిరండూల్‌ రైల్వే లైన్‌లో బొర్రాగుహలు వద్ద భారీ వర్షానికి రైలు ట్రాక్‌ కోతకు గురైంది. దీంతో ఈ రూట్‌లో గూడ్స్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అరకు–విశాఖ రోడ్డులోని ఘాట్‌ ప్రాంతంలో రోడ్డు­పై వరద నీరు పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు ఘాట్‌లోను ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలి­పివేశారు. జి.మాడుగుల, పాడే­రు, పెదబయలు, ముంచంగిపుట్టు, డు­ంబ్రిగుడ మండలాల్లోని సుమారు 200 మారుమూల గ్రామాలకు రవా­ణా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలలో పంటలు నీట మునిగాయి. 

ట్రావెల్స్‌ బస్సుపై కూలిన భారీ వృక్షం 
ప్రయాణిస్తున్న బస్సుపై ఓ భారీ వృక్షం విరిగి పడింది. పలాస నుంచి విజయవాడకు 30 మంది ప్రయాణికులతో ప్రతాప్‌ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు బయలుదేరింది. బుధవారం ఉదయం ఏలూరు జాతీయ రహదారిలోని మినీ బైపాస్‌ వద్దకు బస్సు చేరుకునే సరికి ఈదురుగా­లుల ధాటికి రహదారి పక్కన ఉన్న ఓ భారీ చెట్టు ఒక్కసారిగా నడుస్తున్న బస్సుపై కూలిపోయింది. ఊహించని ఈ ఘటనతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఒక్కసారిగా బస్సు కుదుపులకు లో­నుకావడంతో నిద్రమత్తులో ఉన్న ప్ర­యాణికులు భయాందోళనతో హా­హా­కారాలు చేశారు. ఈ ప్రమాదంలో బ­స్సు డ్రైవర్‌ శ్రీనివాసరావుకు మా­త్ర­మే గాయాలయ్యా­యి. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండటంతో పెను విషాదం తప్పింది. పోలీ­సు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలా­నికి చేరుకుని, మరో బస్సు ఏ­ర్పాటు చేసి ప్రయాణికులను విజ­యవాడకు పంపారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

పడిపోయిన చెట్లు.. ఇళ్లలోకి నీళ్లు
⇒ శ్రీకాకుళంలోని 30 మండలాల్లో 809 మి.వీు. వర్షం కురిసింది. కొత్తూరులో హడ్డుబంగి గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఎచ్చెర్ల మండలం కుప్పిలి గెడ్డ ఉప్పొంగడంతో రహదారులు నీట మునిగా­యి. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, హుకుంపేట తదితర చోట్ల 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా.. కట్టెలు, గ్యాస్‌ లేక వంట చేయడం సాధ్యం కాలేదు. శ్రీకాకుళం రిమ్స్‌లోని వార్డుల్లోకి నీరు చేర­డం­తో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఉద్దా­నంలో కొబ్బరి చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది.  

⇒ అర్నబ్‌ తుపాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా 126 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ­్బ తిన్నాయని, వాటి తాత్కాలిక, శాశ్వత పునరుద్దరణకు రూ.59 కోట్లపైగా అవసరమవుతాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలి­పారు. రహదారులపై 1,058 చెట్లు కూలిపోయాయని, 57 చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు.  

⇒ తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఏలూరు నుండి శ్రీకాకుళం వరకు గల జాతీయ రహదారులపై రక్షణ చర్యలను చేపట్టినట్టు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) తెలిపింది. 32 పెట్రోలింగ్‌ వాహనాలు, 31 అంబులెన్సులు, 35 క్రేన్లు, టో–అవే వెహికల్స్, 47 జేసీబీలు, 25 చెట్లు కోసే పవర్‌ రంపాలు, 45 డంపర్లు, 24 క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.  

⇒ పశ్చిమగోదావరి జిల్లాలో ఉప్పుటేరు, యనమదుర్రు, ఎర్రకాలువ, కాజా తదితర డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. 1.72 లక్షల ఎకరాల్లోని పంట నేలకొరిగింది. ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోయింది. కమ్యూనికేషన్, ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించాయి. 
⇒ కృష్ణా జిల్లాలో  35 వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. 65 ఇళ్లు దెబ్బతిన్నాయి. పెడన పట్టణంలో చేనేత కార్మికుల మగ్గాలు చెమ్మగిల్లడంతోపాటు నీళ్లు చేరడంతో పనులు నిలిచిపోయాయి. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రేకుల షట్టర్‌ ఎగిరి జాతీయ రహదారిపై పడిపోయింది. ఇదే ఊళ్లో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోగా, ఇంటిలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. పలు రహదారుల్లో వృక్షాలు నేలకొరిగాయి. 

⇒  గుంటూరు జిల్లా 11 మండలాల్లోని 69 గ్రామాల్లో 9,889 మంది రైతులకు చెందిన 22,997 ఎకరాల్లో వరి, మినుము, పత్తి పంటలకు.. 862.5 ఎకరాల్లో ఉద్యాన పంటలకు, మొత్తంగా 23,860 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు, పెదపరివిు–నెక్కల్లు మధ్య లోలెవల్‌ చప్టా పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కాకినాడ జిల్లాగజగజ
ఉప్పాడ వద్ద అల్లకల్లోలంగా సముద్రం 
బీచ్‌రోడ్డు ధ్వంసం.. రాకపోకలకు అంతరాయం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లాలో అర్నబ్‌ తుపాను విధ్వంసం సృష్టించింది. తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షం తాకిడికి భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు వేలాదిగా నేలకొరిగాయి. రెండు రోజుల పాటు జిల్లా అంధకారంలో మగ్గింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తుపాను ధాటికి భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 92 రెవెన్యూ గ్రామాలు తుపానుకు ప్రభావితం కాగా.. 11,103 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

 తుని–నర్సీపట్నం రోడ్డులోని డి.పోలవరం వద్ద భారీ వృక్షం రోడ్డుపై విరిగి పడటంతో రాకపోకలు స్తంభించాయి. కొత్తపల్లి మండలంలో మత్స్యకార గృహాలు, తీర ప్రాంతం, రహదారులు కోతకు గురయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. తుని మండలం డి.పోలవరంలో 150 ఏళ్ల చరిత్ర ఉన్న చింత చెట్టు కుప్పకూలిపోయింది. సూర్యారావుపేట, వాకలపూడి, తూరంగి మత్స్యకార గ్రామాలతో పాటు, కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగ తదితర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్దకు పడవలు కొట్టుకు వచ్చాయి. 

ఉప్పాడ సముద్ర తీరంలో అర్నబ్‌ తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. కడలి ఉగ్రరూపం దాల్చింది. అలలు భారీగా ఎగసిపడుతూ ఉవ్వెత్తున తీర గ్రామాలపై విరుచుకుపడ్డాయి. అలల ఉధృతికి తీరం కోతకు గురైంది. కొత్తపట్నం వద్ద రాళ్లు కొట్టుకు రావడంతో బీచ్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఉప్పాడ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఉప్పాడ–కాకినాడ మధ్య రాకపోకలు నిలిపివేశారు.

 తీరంలోని మత్స్యకారుల గృహాలు కళ్లెదుటే కడలిలో కలిసిపోయాయి. సుబ్బంపేట, ఉప్పాడ, సూరాడపేట, జగ్గరాజపేట, పల్లిపేట, రంగంపే, మాయాపట్నం తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఉప్పాడ, కోనపాపపేట తీరప్రాంతాల్లో 100 మత్స్యకార గృహాలు కోతకు గురయ్యాయి. రోడ్లు, విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. ఉప్పాడ బీచ్‌ రోడ్డులో రక్షణ గోడగా ఏర్పాటు చేసిన బండరాళ్ల గోడకు సముద్రపు కెరటాలు బలంగా తాకడంతో రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. కోనపాపపేట, ఉప్పాడలో రహదారి పూర్తిగా కోతకు గురైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement