తుపాను సహాయక చర్యల్లో ఇద్దరు సచివాలయ ఉద్యోగుల దుర్మరణం | Junior Lineman Dies During Power Restoration Work in Vizianagaram | Sakshi
Sakshi News home page

తుపాను సహాయక చర్యల్లో ఇద్దరు సచివాలయ ఉద్యోగుల దుర్మరణం

Oct 29 2026 5:44 AM | Updated on Oct 29 2026 5:44 AM

Junior Lineman Dies During Power Restoration Work in Vizianagaram

పోలవరం జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఏఎన్‌ఎం

విజయనగరం జిల్లాలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేస్తూ జేఎల్‌ఎం మృతి

కోరుకొండ/వేపాడ: అర్నబ్‌ తుపాను సహా­యక చర్యల్లో పాల్గొన్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు దుర్మరణం చెందారు. పోలవరం జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొని వస్తుండగా మోటార్‌ సైకిల్‌ వాగులో కొట్టుకుపోయిన ఘటనలో ఓ మహిళా సచివాలయ ఉద్యోగి దుర్మరణం చెందింది. విజయనగరం జిల్లాలో విద్యుత్‌ను పునరుద్ధరిస్తుండగా జేఎల్‌ఎం విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన కారం సత్యవతి (48) సీతానగరం మండలం నాగంపల్లి గ్రామం సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. బుధవారం ఆమె నాగంపల్లి గ్రా­మంలో తుపాను సహాయక చర్యల్లో పాల్గొ­న్నారు. 

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె భర్తతో కలిసి బైక్‌పై బయల్దేరారు. అదే బైక్‌పై సత్యవతి సహోద్యోగి బి.భవానీ కూడా ఉన్నారు. మార్గంమధ్యలో కోటి కేశవరం గ్రామం వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారి మోటార్‌ సైకిల్‌ కొట్టుకు­పోయింది. దాంతోపాటు సత్యవతి కూడా నీటిలో కొట్టుకు­పోయింది. ఆమె భర్త, భవానీ ప్రాణాలతో బయ­ట­పడ్డారు. సత్యవతి ఆచూ­కీ దొరకలేదు. విజయనగ­రం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లికి చెందిన దువ్వాడ పైడిరాజు (28) అదే గ్రామ సచివాల­యంలో జేఎల్‌ఎంగా పని­చేస్తున్నాడు. 

అర్నబ్‌ తుపాను కారణంగా గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి బుధవారం రాత్రి నీలకంఠరాజుపురం ఎస్సీ కాలనీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏబీ స్విచ్‌ ఆపరేషన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురైన పైడిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్‌ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్‌ కేసు నమోదు చేశారు.

చెట్టు కూలిపడి భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన కొవ్వాడ నగేష్‌కుమార్‌(45), భార్య వీరలక్ష్మిలు గురువారం బైక్‌పై కోరుకొండ నుంచి చాగల్లు వస్తున్నారు. మార్గం మధ్యలో ఓ చెట్టు వారిపై పడటంతో నగేష్‌కుమార్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలపాలైన వీరలక్ష్మిని స్థానికులు 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement