ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి పిలుపు
ఇప్పుడు మేల్కోకపోతే ఉద్యోగుల భవిష్యత్ అంధకారమే
ఉద్యోగులకు పంగనామాలు పెట్టిన ప్రభుత్వం ఇది
డీఏలు లేవు.. ఐఆర్ లేదు.. పీఆర్‌సీ లేదు.. పెండింగ్ బిల్లులు లేవు.. స్థానిక సంస్థల ఎన్నికలయ్యాక పట్టించుకోరు
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఆగిపోయింది
ఓపీఎస్ లేదు.. పెన్షన్ గ్యారంటీ ఇచ్చే జీపీఎస్ కూడా లేదు
అందుకే ఇప్పుడు బుద్ధి చెబితే ఉద్యోగుల వైపు చూస్తుంది
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులు బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు మేల్కోకపోతే ఉద్యోగుల భవిష్యత్ అంధకారమేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాటా్లడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగమైన పోలీసులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి వత్తాసు పలకటం ఆశ్చర్యకరం అన్నారు.
పోలీసులకు వీక్ ఆఫ్ లేదని, వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీ చంద్ర బాబు నెరవేర్చలేదని చెప్పారు. ఏ కోణంలో వారు చంద్రబాబు ప్రభుత్వానికి కొమ్ము కాశారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు, పోలీసులకు ఎలాంటి మేలు చేయలేదని చెప్పారు. ఈ ప్రభుత్వం వివిధ రకాల ఉద్యోగులను ఎలా మోసం చేసింది.. ఒక్కో ఉద్యోగికి ఎంత నష్టం కలిగిందనేది గణాంకాలతో సహా విడుదల చేశారు.
‘ఉద్యోగులకు డీఏలు లేవు, ఐఆర్ లేదు. పీఆర్‌సీ లేదు. పెండింగ్ బిల్లులు లేవు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఆగిపోయింది. సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ లేదు. కనీసం పెన్షన్ గ్యారంటీ ఇచ్చే జీపీఎస్ కూడా లేదు. పెన్షనర్లకు కార్పొరేషన్ లేదు. పోలీసులకు శని, ఆదివారాలు సెలవులు లేవు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు లేవు. వలంటీర్లకు 10 వేల జీతం దేవుడెరుగు.. అసలు ఉద్యోగమే లేదు.
వీఆర్‌ఏలకు జీతం పెంచలేదు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు, ఏఏఎస్‌హెచ్‌ఏ వర్కర్లకు రూపాయి జీతం పెంచలేదు. హోంగార్డులకు జీతం పెరగలేదు. అంగన్ వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవం లేదు.. నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవు. జీవో నెంబర్ 11 తెచ్చి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్ట్ లేకుండా చేశారు. అసెంబ్లీ ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పని చేయవు.
టీచర్లకు యాప్‌ల గోల తగ్గలేదు.. ప్రమోషన్లు లేవు. టీచర్ల నెత్తిన టెట్ అనే గుదిబండ తెచ్చి పెట్టారు. పోలీసులకు 5 సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్కోస్ రద్దు చేసి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ దళారుల పాలు చేశారు. రేషనలైజేషన్ పేరుతో సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులకు పీఆర్‌సీ లేదు. ఈ రకంగా ఉద్యోగులను వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఇదే.
స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులు సహకారం అందిస్తే ఇంకా అహంకారం పెరుగుతుంది. ఈ ఎన్నికలు పూర్తయితే 2029 ఎన్నికల వరకు పట్టించుకోదు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఉద్యోగులు వ్యవహరించాలి. అప్పుడే ప్రభుత్వం ఉద్యోగుల వైపు చూస్తుంది’ అని స్పష్టం చేశారు.


