ఉద్యోగులతో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మంత్రి సత్యకుమార్ బెదిరింపులు
అనంతపురం సిటీ: బీజేపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసిన హెచ్చరికలు అనంతపురం జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఉదయం అనంతపురం జీజీహెచ్‌కు చేరుకున్న మంత్రి సత్యకుమార్ అక్కడి వైద్యాధికారులతో కలిసి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థికి ఓటు వేయకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి హెచ్చరికలతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యాధికారులు కూడా అవాక్కయ్యారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించాల్సింది పోయి.. ఓటు వేయకపోతే ఉద్యోగాలు తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది.


