కృష్ణా జిల్లా పెనమలూరులో ఈదురుగాలుల ధాటికి నేలకొరిగిన వరి పంట
8.30 లక్షల ఎకరాల పంటలు ముంపులోనే..
7.60 లక్షల ఎకరాల్లో వరిచేలు మునక
50 వేల ఎకరాల్లో ఉద్యాన, ఇతర పంటలకు అపార నష్టం
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. కోనసీమ రైతులకు కల్పవృక్షంగా నిలిచిన కొబ్బరి చెట్లు వేలాదిగా విరిగిపడగా, అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. లంక గ్రామాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయి. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు రైతులకు ఉన్న కొద్దిపాటి ఆశలను చిదిమేశాయి. తీరప్రాంతాల్లో ఆక్వా రంగంపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ప్రాధమిక అంచనాల ప్రకారం..249 మండలాల్లో 2,747 గ్రామాల పరిధిలో 5 లక్షల మంది రైతులకు చెందిన 8.30 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా. వీటిలో అత్యధికంగా 7.60 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లుగా లెక్కతేల్చారు. 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు మరో 20 వేల ఎకరాల్లో మొక్క జొన్న, పత్తి, మినుము, పెసలు చెరుకు తదితర పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఉదారంగా ఆదుకోకపోతే తమ పరిస్థితి అధోగతే అని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వరి రైతు విలాపం..
తుపానుతో శ్రీకాకుళం మొదలు బాపట్ల వరకు తీర ప్రాంత జిల్లాల్లోని పంటలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్‌లో 37.33 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, దాంట్లో 26 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల్లోనే సాగైంది. ఈ జిల్లాల్లో ఎకరాకు రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పొట్ట దశకు చేరుకున్న వరి చేలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో పంట పూర్తిగా నేలమట్టమైంది.
పంట చేలలో మొలలోతు నీరు నిలిచిపోయింది. తుపాను తీరం దాటినప్పటికీ ఆ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల ముంపునకు గురైన వరిచేలు కుళ్లిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొబ్బరి రైతు ఆక్రందన..
కోనసీమలో 1.10 కోట్లకు పైగా కొబ్బరి చెట్లున్నాయి. బలమైన గాలులకు తీర ప్రాంతంలో వేలాది చెట్లు విరిగిపడి పోగా, మరికొన్ని చోట్ల మొవ్వలు దెబ్బతిన్నాయి. ఎకరాకు 10కు పైగా చెట్లు నేలకొరిగినట్లు అధికారుల అంచనా. ఈ తుపాను ప్రభావంతో ఐదారు నెలల పాటు దిగుబడులొచ్చే పరిస్థితుల్లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా 150 మండలాల్లో 809 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
అత్యధికంగా 34 వేల ఎకరాల్లో అరటి, 8,600 ఎకరాల్లో కూరగాయలు, 1400 ఎకరాల్లో బొప్పాయి, వెయ్యి ఎకరాల్లో కొబ్బరి, వెయ్యి ఎకరాల్లో పసుపు, 2,300 ఎకరాల్లో ఆయిల్ పామ్, టమాటా, మిరప, పూలు, తమలపాకు తదితర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరితోపాటు మొక్కజొన్న, పత్తి, ఉద్యాన పంటలను తుపాను దెబ్బతీసింది. విద్యుత్ కోతలతో కోస్తా జిల్లాల్లోని ఆక్వా చెరువులకు ఆక్సిజన్ కొరతతో లక్షలాది ఎకరాల్లోని ఆక్వా చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి.


