breaking news
Losses to farmers
-
అర్నబ్ తుపానులో మునిగిన అన్నదాత
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. కోనసీమ రైతులకు కల్పవృక్షంగా నిలిచిన కొబ్బరి చెట్లు వేలాదిగా విరిగిపడగా, అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. లంక గ్రామాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయి. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి, కోస్తాంధ్రలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు రైతులకు ఉన్న కొద్దిపాటి ఆశలను చిదిమేశాయి. తీరప్రాంతాల్లో ఆక్వా రంగంపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ప్రాధమిక అంచనాల ప్రకారం..249 మండలాల్లో 2,747 గ్రామాల పరిధిలో 5 లక్షల మంది రైతులకు చెందిన 8.30 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా. వీటిలో అత్యధికంగా 7.60 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లుగా లెక్కతేల్చారు. 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు మరో 20 వేల ఎకరాల్లో మొక్క జొన్న, పత్తి, మినుము, పెసలు చెరుకు తదితర పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఉదారంగా ఆదుకోకపోతే తమ పరిస్థితి అధోగతే అని రైతులు గగ్గోలు పెడుతున్నారు.వరి రైతు విలాపం..తుపానుతో శ్రీకాకుళం మొదలు బాపట్ల వరకు తీర ప్రాంత జిల్లాల్లోని పంటలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్‌లో 37.33 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, దాంట్లో 26 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల్లోనే సాగైంది. ఈ జిల్లాల్లో ఎకరాకు రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పొట్ట దశకు చేరుకున్న వరి చేలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో పంట పూర్తిగా నేలమట్టమైంది. పంట చేలలో మొలలోతు నీరు నిలిచిపోయింది. తుపాను తీరం దాటినప్పటికీ ఆ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల ముంపునకు గురైన వరిచేలు కుళ్లిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి రైతు ఆక్రందన..కోనసీమలో 1.10 కోట్లకు పైగా కొబ్బరి చెట్లున్నాయి. బలమైన గాలులకు తీర ప్రాంతంలో వేలాది చెట్లు విరిగిపడి పోగా, మరికొన్ని చోట్ల మొవ్వలు దెబ్బతిన్నాయి. ఎకరాకు 10కు పైగా చెట్లు నేలకొరిగినట్లు అధికారుల అంచనా. ఈ తుపాను ప్రభావంతో ఐదారు నెలల పాటు దిగుబడులొచ్చే పరిస్థితుల్లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా 150 మండలాల్లో 809 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.అత్యధికంగా 34 వేల ఎకరాల్లో అరటి, 8,600 ఎకరాల్లో కూరగాయలు, 1400 ఎకరాల్లో బొప్పాయి, వెయ్యి ఎకరాల్లో కొబ్బరి, వెయ్యి ఎకరాల్లో పసుపు, 2,300 ఎకరాల్లో ఆయిల్ పామ్, టమాటా, మిరప, పూలు, తమలపాకు తదితర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరితోపాటు మొక్కజొన్న, పత్తి, ఉద్యాన పంటలను తుపాను దెబ్బతీసింది. విద్యుత్ కోతలతో కోస్తా జిల్లాల్లోని ఆక్వా చెరువులకు ఆక్సిజన్ కొరతతో లక్షలాది ఎకరాల్లోని ఆక్వా చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. -
ఎంత నిర్లక్ష్యమో..!
గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: పగబట్టిన ప్రకృతి, పట్టించుకోని ప్రభుత్వం కారణంగా ఏటా రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా నీటి వనరులు లేకపోవడమే రైతు కుదేలుకు కారణమవుతోంది. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించి ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. దీని కోసం అనేక సార్లు రైతులు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కరుణించి నిధులు విడుదల చేసింది. అయితే పనుల నిర్వహణలో మాత్రం అధికారులు నత్తకు నడకలు నేర్పుతున్నారు. దీంతో పంటలకు నీళ్లందక రైతులు అవస్థలు పడుతున్నారు. మండలానికి సగిలేరు సపై చానల్ పనులు మంజూరై రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు 25 శాతం పనులు కూడా చేయలేదు. ఈ చానల్ పూర్తయితే ఐదు చెరువుల పరిధిలో ఆయకట్టుకు నీరందుతుంది. ఇరిగేషన్ శాఖాధికారులు మాత్రం దీనిపై ఎక్కడ లేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వర్షపు నీటిని మళ్లించి రాచర్ల మండలంలోని ఐదు చెరువులు నింపేందుకు 40 ఏళ్ల క్రితం సగిలేరు సప్లై చానల్ నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత దీన్ని పట్టించుకోకపోవడంతో పూడిపోయింది. 2011 డిసెంబరులో కాలువ మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏడు కిలోమీటర్ల మేర ఉన్న కాలువ, కొండపేట వద్ద ఉన్న యాక్యూడెట్, పాములపల్లె రోడ్డు, నల్లబండ బజారులో రెండు బ్రిడ్జిలు, రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు స్టిల్వే, సగిలేరు ఆనకట్ట వద్ద యాప్రాన్, 200 మీటర్ల మేర కాలువకిరువైపులా గోడలు వంటి పనులు నిర్వహించాలి. కాంట్రాక్టర్ కొండపేట నుంచి పాములపల్లె మధ్య కొంత భాగంలో మాత్రమే కాలువ పనులు చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు పనులు జరుగుతున్న వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం పనులు వదిలి... రెండు నెలల క్రితం మంజూరైన పనులు పూర్తి: రైతులకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్న సగిలేరు సప్లై చానల్ పనులను రెండేళ్లవుతున్నా పూర్తి చేయకుండా.. రెండు నెలల క్రితం మంజూరైన ఎఫ్డీఆర్ పనులను పూర్తి చేయడంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సగిలేరు సప్లై చానల్ పనులకు సంబంధించిన పర్సంటేజీలు అప్పటి అధికారులు దిగమింగడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఎఫ్డీఆర్ పనుల్లో భాగంగా డివిజన్ పరిధిలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో రెండు నెలల క్రితం మంజూరైన *1.35 కోట్ల పనులను మాత్రం పూర్తి చేశారు. ఈ పనులకు పర్సంటేజీలు అందడంతోనే త్వరగా ముగించారని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సగిలేరు సప్లై చానల్ పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. డీఈ వివరణ: సగిలేరు సప్లై చానల్ కాలువ పనులు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ డీఈ యూ.బాలగురువయ్య తెలిపారు. ఎఫ్డీఆర్ పనులు తక్షణం చేయాల్సినవి కావున అవసరాన్ని బట్టి కొన్ని చెరువు పనులను పూర్తిచేశామన్నారు.


