ఎంత నిర్లక్ష్యమో..! | neglect on sagileru supply channel works | Sakshi
Sakshi News home page

ఎంత నిర్లక్ష్యమో..!

Feb 25 2014 2:48 AM | Updated on Sep 2 2017 4:03 AM

పగబట్టిన ప్రకృతి, పట్టించుకోని ప్రభుత్వం కారణంగా ఏటా రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.

గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: పగబట్టిన ప్రకృతి, పట్టించుకోని ప్రభుత్వం కారణంగా ఏటా రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా నీటి వనరులు లేకపోవడమే రైతు కుదేలుకు కారణమవుతోంది. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించి ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. దీని కోసం అనేక సార్లు రైతులు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కరుణించి నిధులు విడుదల చేసింది. అయితే పనుల నిర్వహణలో మాత్రం అధికారులు నత్తకు నడకలు నేర్పుతున్నారు. దీంతో పంటలకు నీళ్లందక రైతులు అవస్థలు పడుతున్నారు.

  మండలానికి సగిలేరు సపై చానల్ పనులు మంజూరై రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు 25 శాతం పనులు కూడా చేయలేదు. ఈ చానల్ పూర్తయితే ఐదు చెరువుల పరిధిలో ఆయకట్టుకు నీరందుతుంది. ఇరిగేషన్ శాఖాధికారులు మాత్రం దీనిపై ఎక్కడ లేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వర్షపు నీటిని మళ్లించి రాచర్ల మండలంలోని ఐదు చెరువులు నింపేందుకు 40 ఏళ్ల క్రితం సగిలేరు సప్లై చానల్ నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత దీన్ని పట్టించుకోకపోవడంతో పూడిపోయింది. 2011 డిసెంబరులో కాలువ మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది.

ఈ నిధులతో ఏడు కిలోమీటర్ల మేర ఉన్న కాలువ, కొండపేట వద్ద ఉన్న యాక్యూడెట్, పాములపల్లె రోడ్డు, నల్లబండ బజారులో రెండు బ్రిడ్జిలు, రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు స్టిల్‌వే, సగిలేరు ఆనకట్ట వద్ద యాప్రాన్, 200 మీటర్ల మేర కాలువకిరువైపులా గోడలు వంటి పనులు నిర్వహించాలి. కాంట్రాక్టర్ కొండపేట నుంచి పాములపల్లె మధ్య కొంత భాగంలో మాత్రమే కాలువ పనులు చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు పనులు జరుగుతున్న వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

 రెండేళ్ల క్రితం పనులు వదిలి... రెండు నెలల క్రితం మంజూరైన
 పనులు పూర్తి:
 రైతులకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్న సగిలేరు సప్లై చానల్ పనులను రెండేళ్లవుతున్నా పూర్తి చేయకుండా.. రెండు నెలల క్రితం మంజూరైన ఎఫ్‌డీఆర్ పనులను పూర్తి చేయడంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సగిలేరు సప్లై చానల్ పనులకు సంబంధించిన పర్సంటేజీలు అప్పటి అధికారులు దిగమింగడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఎఫ్‌డీఆర్ పనుల్లో భాగంగా డివిజన్ పరిధిలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో రెండు నెలల క్రితం మంజూరైన *1.35 కోట్ల పనులను మాత్రం పూర్తి చేశారు. ఈ పనులకు పర్సంటేజీలు అందడంతోనే త్వరగా ముగించారని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సగిలేరు సప్లై చానల్ పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

 డీఈ వివరణ:
 సగిలేరు సప్లై చానల్ కాలువ పనులు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ డీఈ యూ.బాలగురువయ్య తెలిపారు. ఎఫ్‌డీఆర్ పనులు తక్షణం చేయాల్సినవి కావున అవసరాన్ని బట్టి కొన్ని చెరువు పనులను పూర్తిచేశామన్నారు.

Advertisement

పోల్

Advertisement