ఆస్ట్రేలియా ప్రభుత్వం బోండి బీచ్ ఉగ్రవాద ఘటన దరిమిలా దేశవ్యాప్తంగా తుపాకీ సంస్కరణల దిశగా ముందడుగు వేసింది. మూడు దశాబ్దాల అనంతరం అత్యంత భారీస్థాయిలో ‘గన్ బైబ్యాక్’ పథకాన్ని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు. బోండి బీచ్‌లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి నేపథ్యంలో, తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసి, దేశ పౌరుల భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నాటి ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండలలో ..
దేశంలో 1996లో జరిగిన ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండ తర్వాత ఆస్ట్రేలియా చేపడుతున్న అతిపెద్ద ఆయుధ సేకరణ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. నాడు టాస్మేనియాలోని పోర్ట్ ఆర్డర్ ద్వీపంలో ఒక సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 35 మంది మృతిచెందారు. ఈ ఘటన దరిమిలా ఆస్ట్రేలియా ప్రభుత్వం తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేసింది. అప్పట్లో సుమారు ఏడు లక్షల ఆయుధాలను తొలగించగా, ప్రస్తుతం ఈ పథకం ద్వారా లక్షలాది తుపాకులను సేకరించాలని ఆస్ట్రేలియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూడు విధాలుగా సేకరణ
లైసెన్స్ కలిగిన యజమానుల వద్దనున్న మిగులు ఆయుధాలను లేదా కొత్తగా నిషేధించిన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తే, వారికి తగిన పరిహారం చెల్లించనున్నారు. ఈ భారీ ఆపరేషన్‌ను అటు ఫెడరల్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. రాష్ట్ర పోలీసులు, అధీకృత డీలర్లు తుపాకీలను సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆయుధాల నాశనాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు స్వయంగా పర్యవేక్షిస్తారు. దీనివల్ల నిధుల వినియోగం, భద్రతలో లోపాలు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.
40 లక్షలకు పైగా తుపాకులు
బోండి బీచ్‌లో ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని అల్బనీస్.. ప్రస్తుతం దేశంలో 40 లక్షలకు పైగా తుపాకులు చెలామణిలో ఉన్నాయని, ఇది పోర్ట్ ఆర్థర్ సమయం కంటే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తుపాకీ నియంత్రణకు ఇదే సరైన సమయమని ఆయన స్పష్టం చేశారు. ఈ ‘బైబ్యాక్’లో ప్రధానంగా మూడు రకాల ఆయుధాలను సేకరించనున్నారు.
తుపాకీ నియంత్రణకు సమగ్ర ప్యాకేజీ
కొత్తగా నిషేధించిన అత్యాధునిక ఆయుధాలు, ఇప్పటికే చట్టవిరుద్ధంగా ముద్ర వేసినవి, యజమానులు ఇకపై తమకు అవసరం లేదని భావించే అదనపు ఆయుధాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా అనవసరంగా ఇళ్లలో ఉండే ఆయుధాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం కేవలం బైబ్యాక్ మాత్రమే కాకుండా, తుపాకీ నియంత్రణ కోసం ఒక సమగ్ర ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని తుపాకులు కలిగి ఉండాలనే దానిపై కఠినరీతిలో పరిమితులు విధిస్తారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గల తుపాకీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘నేషనల్ గన్ రిజిస్టర్’ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది.
పౌర స్వేచ్ఛావాదుల విమర్శలు
2026 మధ్య నాటికి తుపాకీ నియంత్రణ కొత్త చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానాన్ని న్యాయవాదులు, కాల్పుల బాధితులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయుధాల సంఖ్య తగ్గితేనే సమాజం సురక్షితంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై కొందరు తుపాకీ యజమానులు, పౌర స్వేచ్ఛావాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. చట్టబద్ధంగా ఆయుధాలు కలిగిన వారు ఈ నిర్ణయంతో ఇబ్బంది పడతారని వారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దేశంలో భద్రతా ముప్పు దృష్ట్యా ఇది ఒక తప్పనిసరి చర్య అని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.
ఇది కూడా చదవండి: ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు


