ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతుంది. స్టీవ్‌ను రానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎడిషన్ కోసం సియాల్‌కోట్ స్టాలియన్జ్ అనే ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. స్టాలియన్జ్ స్టీవ్‌ను డైరెక్ట్ సైనింగ్ ద్వారా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
ఈ వార్త పాక్ అభిమానుల సోషల్‌మీడియా గ్రూప్‌ల్లో హల్‌చల్ చేస్తుంది. పాక్ ఫ్యాన్స్ స్టీవ్‌కు స్వాగతం పలుకుతున్నారు. స్టీవ్ ఇప్పటివరకు పీఎస్‌ఎల్‌లో ఆడలేదు. స్టీవ్ రాక పీఎస్‌ఎల్‌కు కల తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం స్టీవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.
తాజాగా ముగిసిన బిగ్ బాష్ లీగ్ (BBL) 15వ సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతూ 6 మ్యాచ్‌ల్లో 299 పరుగులు (సగటు 59.80, స్ట్రైక్ రేట్ 167.97) చేశాడు. ఇందులో 42 బంతుల్లో శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్‌లో 272 మ్యాచ్‌లు ఆడిన స్టీవ్.. 6,242 పరుగులు, 5 శతకాలు, 30 అర్ధశతకాలు సాధించాడు.
కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ తదుపరి ఎడిషన్ ప్రారంభానికి ముందు పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీకి ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సంతకం చేసుకునే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో ఆడని ఆటగాడిని మాత్రమే ఈ విధానం ద్వారా తీసుకోవచ్చు. స్టాలియన్జ్ ఈ అవకాశాన్ని వినియోగించి స్టీవ్‌ను చేజిక్కించుకుంది. స్టాలియన్జ్ PSLలో కొత్తగా ప్రవేశించిన రెండు జట్లలో ఒకటి.
2026 జనవరి 8న జిన్నా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఫ్రాంచైజీల వేలంలో OZ Developers (హమ్జా మజీద్, కామిల్ ఖాన్) స్టాలియన్జ్‌ను రూ.1.85 బిలియన్ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. PSL చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది.


