భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాక్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..! | Why Mohsin Naqvi PCB cannot be punished for boycotting IND Vs PAK T20 WC match | Sakshi
Sakshi News home page

భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాక్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..!

Feb 3 2026 1:08 PM | Updated on Feb 3 2026 1:19 PM

Why Mohsin Naqvi PCB cannot be punished for boycotting IND Vs PAK T20 WC match

టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను పాక్‌ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్‌ ఎహసాన్‌ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్‌ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.

ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్‌ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లను పాక్‌లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్‌ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు.  

కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్‌ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్‌ హోల్‌ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్‌తో మ్యాచ్‌ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక​ సమాచారం కూడా ఇ‍వ్వలేదు. కేవలం​ ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.

మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్‌పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్‌ను పక్కన పెట్టి పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్‌ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్‌ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్‌పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement