క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం | Former hockey World Cup player Wayne Madsen to captain Italy at T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం

Feb 3 2026 12:02 PM | Updated on Feb 3 2026 12:20 PM

Former hockey World Cup player Wayne Madsen to captain Italy at T20 World Cup 2026

క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం చోటు చేసుకుంది. ఓ ఆటగాడు 20 ఏళ్ల కిందట ఓ దేశం తరఫున హాకీ ప్రపంచకప్‌ ఆడి.. త్వరలో మరో దేశం​ తరఫున క్రికెట్‌ ప్రపంచకప్‌ (టీ20) ఆడబోతున్నాడు. క్రికెట్‌ పుట్టినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఒకే ఆటగాడు రెండు వేర్వేరు దేశాల తరఫున ఆడాడు కానీ, వేర్వేరు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో ప్రపంచకప్‌ టోర్నీల్లో మాత్రం ఒక్కరు కూడా పాల్గొనలేదు.

ఇలాంటి చారిత్రక గౌరవం సౌతాఫ్రికాలో పుట్టి, ఇటలీ తరఫున టీ20 ప్రపంచకప్‌ ఆడనున్న 42 ఏళ్ల వేన్‌ మ్యాడ్‌సన్‌కు దక్కింది. మ్యాడ్‌సన్‌ సౌతాఫ్రికా తరఫున 2006 హాకీ ప్రపంచకప్‌ ఆడి.. ఇటలీ తరఫున 2026 టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఇటలీ జట్టుకు మ్యాడ్‌సన్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించనున్నాడు. 

టీ20 ప్రపంచకప్‌ ఆడబోయే 20 జట్లలో ఇటలీ ఒకటి. ఈ యూరోపియన్‌ జట్టు క్వాలిఫయర్స్‌ ద్వారా ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఇటలీకి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కడంలో ఆసీస్‌ మాజీ ఆటగాడు జో బర్న్స్‌ కీలకపాత్ర పోషించాడు. బర్న్స్‌ పలు చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆడి ఇటలీకి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కేలా చేశాడు. వాస్తవానికి బర్న్స్‌నే ఇటలీ ప్రపంచకప్‌ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. 

అయితే ఇటలీ సెలెక్టర్లు బర్న్స్‌ను అనూహ్యంగా తప్పించి మ్యాడ్సన్‌కు ఇటలీ పగ్గాలు అప్పజెప్పారు. మ్యాడ్సన్‌ 2023లో ఇటలీ తరఫున అరంగేట్రం చేసి 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వాస్తవానికి మ్యాడ్సన్‌ క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకొని 2003లోనే దేశవాలీ అరంగేట్రం చేశాడు. 

ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా టీ20 క్రికెట్‌ లీగ్‌లు (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌, హండ్రెడ్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ​్‌) ఆడాడు. అయితే హాకీలో కూడా ప్రొఫెషనల్‌ అయిన మ్యాడ్సన్‌కు 2006లో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం​ లభించింది. 

ఆ ఏడాది అతను హాకీ ప్రపంచకప్‌తో పాటు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ ఆడాడు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వేరే దేశం తరఫున క్రికెట్‌ ప్రపంచకప్‌ ఆడనున్నాడు.

ఫిబ్రవరి 7 నుంచి భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో మ్యాడ్సన్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. ఇటలీ గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, నేపాల్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లతో పోటీపడనుంది. ఈ జట్టు తమ తొలి ప్రపంచకప్‌ మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న స్కాట్లాండ్‌తో ఆడుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement