‘ఆడకుంటే మీకే నష్టం’  | ICC Warns Pakistan Over Reported Boycott Of India T20 World Cup 2026 Match | Sakshi
Sakshi News home page

‘ఆడకుంటే మీకే నష్టం’ 

Feb 3 2026 5:49 AM | Updated on Feb 3 2026 9:14 AM

ICC Warns Pakistan Over Reported Boycott Of India T20 World Cup 2026 Match

పాకిస్తాన్‌ బోర్డుకు ఐసీసీ హెచ్చరిక 

పరిష్కార మార్గం చూడాలని సూచన

దుబాయ్‌: టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడమంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పందించింది. ఇప్పటికిప్పుడే దీనిపై తీవ్రంగా జవాబివ్వకపోయినా... వాస్తవ పరిస్థితులు వెల్లడిస్తూ పాక్‌కు ఒక రకమైన హెచ్చరిక జారీ చేసింది. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే మున్ముందు పాక్‌ క్రికెట్‌కే నష్టం జరుగుతుందని స్పష్టం చేసింది.

 ‘క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం, పారదర్శకతపై ఆధారపడి ఐసీసీ టోరీ్నలు జరుగుతాయి. ఎంపిక చేసుకున్న మ్యాచ్‌లలో ఆడతామంటే దాని విశ్వసనీయత దెబ్బ తింటుంది. పోటీకి అర్హత సాధించిన అన్ని జట్లూ ఒకే తరహా నిబంధనల ప్రకారం బరిలోకి దిగాలని ఐసీసీ ఆశిస్తోంది. జాతీయ విధానాల ప్రకారం ప్రభుత్వ జోక్యం ఉండటాన్ని మేం గౌరవిస్తాం కానీ ఇది ఆటకే కాకుండా క్రికెట్‌ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందే పాక్‌ క్రికెట్‌కు కూడా మంచిది కాదు. జట్టుపై ఇది దీర్ఘ కాలం ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పీసీబీ అర్థం చేసుకోవాలి. 

ప్రపంచకప్‌ను సమర్థంగా నిర్వహించడంలో ఐసీసీతో పాటు పీసీబీకి కూడా బాధ్యత ఉంది. అందరికీ ఆమోదయోగ్యమయ్యే పరిష్కార మార్గాన్ని పాక్‌ కనుక్కుంటే అందరికీ మేలు చేస్తుంది’ అని ఐసీసీ ప్రకటన జారీ చేసింది. అయితే తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐసీసీ బోర్డు సమావేశమయ్యే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 12 శాశ్వత దేశాల ప్రతినిధులు,  3 అసోసియేట్‌ జట్లకు చెందిన ప్రతినిధులు ఐసీసీ బోర్డులో భాగంగా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఐసీసీ అత్యవసర సమావేశంపై ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ అంశంపై చర్చ జరిగినా లేదా ఏదైనా చర్య తీసుకునేందుకు సిఫారసు చేసినా ఈ బోర్డు సమావేశంలోనే జరుగుతుంది.  

భారీ నష్టానికి అవకాశం... 
భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే కేవలం ప్రసారకర్తలు, ప్రకటనల గురించే కాదు... ఆ మ్యాచ్‌ కారణంగా ప్రభావం చూపించే ఇతర అంశాలన్నీ కలిపితే మ్యాచ్‌ విలువ సుమారు 250 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2200 కోట్లు) ఉంటుందని అంచనా. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది కాబట్టి ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చు. పీసీబీ వార్షిక ఆదాయం 35.5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.324 కోట్లు) మాత్రమే. ఇలాంటి స్థితిలో ఐసీసీ చర్య తీసుకుంటే పాక్‌ కోలుకునే అవకాశం ఉండదు. టోర్నీలో కూడా మ్యాచ్‌ ఆడకుండా 2 పాయింట్లు కోల్పోయేందుకు పాక్‌ సిద్ధమవుతున్నా... ఐసీసీ మ్యాచ్‌ నిబంధనల ప్రకారం పాయింట్లు మాత్రమే కాదు, రన్‌రేట్‌లో కూడా ఆ జట్టు పూర్తిగా వెనుకబడిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement