టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన రీఎంట్రీలో సత్తాచాటాడు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు నవీ ముంబై వేదికగా అమెరికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో తిలక్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. తొలుత 8 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి కాస్త ఆచితూచి ఆడిన తిలక్.. హర్మీత్ సింగ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది ఒక్కసారిగా జోరు పెంచాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌తో కలిసి తిలక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
అయితే మంచి టచ్‌లో కన్పించిన తిలక్, అమెరికా పేసర్ శుభమ్ రంజన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత తిలక్ మంగళవారం(ఫిబ్రవరి 3)న జట్టుతో కలవనున్నాడు. తిలక్ దాదాపు నెల రోజుల నుంచి పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయినప్పటికి గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తొలి మ్యాచ్‌లోనే ఈ తరహా ప్రదర్శన చేయడం గమనార్హం.
భారత్ భారీ స్కోర్
కాగా జగదీశన్ నారయణ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయూష్ బదోని(60) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, శుభమ్, జస్‌దీప్ సింగ్ తలా వికెట్ పడగొట్టారు.


