పాక్‌ ఓవరాక్షన్‌.. ఐసీసీ కీలక సమావేశం! | Pak Boycott Call To India Forces ICC To Call Emergency Meeting: Report | Sakshi
Sakshi News home page

పాక్‌ ఓవరాక్షన్‌.. ఐసీసీ కీలక సమావేశం!

Feb 2 2026 4:47 PM | Updated on Feb 2 2026 5:37 PM

Pak Boycott Call To India Forces ICC To Call Emergency Meeting: Report

పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి సమయం సమీపించిన తరుణంలో భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నామంటూ పాక్‌ ప్రభుత్వం చేసిన ప్రకటన ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది.

అత్యవసర సమావేశం
ఈ నేపథ్యంలో పాక్‌ వైఖరి పట్ల కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యవసరంగా బోర్డు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు టైమ్స్‌నౌ వెల్లడించింది. పీసీబీ గనుక పట్టువీడకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం.

కాగా భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్‌పై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌కు బాసటగా నిలిచేందుకు ఈ మెగా ఈవెంట్‌నే బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాక్‌ ఇప్పుడు ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధమైంది.

భారత్‌తో మాత్రం ఆడబోము
అయితే భారత్‌తో మాత్రం మ్యాచ్‌ ఆడబోమని ప్రకటించింది. నిజానికి జట్లు ఎంపిక, ప్రకటనకు ఐసీసీ ఇచ్చిన తుదిగడువుకు ముందే పీసీబీ తమ జట్టును ప్రకటించింది. కానీ.. తమ ప్రభుత్వం ఆమోదం తెలిపితేనే ప్రపంచకప్‌ ఆడతామని జట్టును ఎంపిక చేసిన సందర్భంలో తెలిపింది. 

ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రం బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో వరల్డ్‌కప్‌ ఆడతామని ఆదివారం స్పష్టం చేసిన పీసీబీ ఈ నెల 15న కొలంబో (శ్రీలంక) వేదికగా భారత్‌తో జరిగే  మ్యాచ్‌లో బరిలోకి దిగబోమని తెలిపింది.

పెద్ద ఎత్తున నష్టాలు
ఈ నేపథ్యంలో పీసీబీపై ఐసీసీ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయంటూ క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  కాగా దాయాదుల ‘ప్రపంచ’ సమరం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 

అయితే, పాక్‌ ప్రకటన వారికి షాకిచ్చింది. భారత్‌తో ఆడబోమంటూ పాక్‌ చేసిన ప్రకటన.. ఫ్యాన్స్‌పైనే కాదు దీని తక్షణ ప్రభావం గ్లోబల్‌ బ్రాడ్‌కాస్టర్లపై కూడా పడుతుంది. 

అసలే 20 జట్లు ఆడుతున్న ఈ మెగా టోర్నీలో ఇక ఒక్క మ్యాచ్‌కు కూడా కిక్కిరిసే మైదానం కనబడక... టికెట్‌ రెవెన్యూ యాడ్‌ రెవెన్యూ, ఓ ప్రపంచకప్‌కు వీక్షకుల సంఖ్య, ఇలా అన్నింటిపైనా ప్రభావం ఉంటుంది. 

ఇదే జరిగితే ఐసీసీ​కి పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి. ఫలితంగా పాక్‌ బోర్డు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ సైతం భద్రతా కారణాలు అంటూ.. భారత్‌లో మ్యాచ్‌ ఆడలేమని పట్టుబట్టగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఇపుడు పాక్‌కు కూడా ఇలాంటి భారీ షాక్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

చదవండి: విచారకరం: షాహిద్‌ ఆఫ్రిది పోస్ట్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement