పాక్‌ ఆటగాడిపై ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్‌ సూర్యవంశీ | Watch Vaibhav Suryavanshi charges at Pakistan player, India avoid handshake later | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆటగాడిపై ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్‌ సూర్యవంశీ

Feb 2 2026 2:29 PM | Updated on Feb 2 2026 2:51 PM

Watch Vaibhav Suryavanshi charges at Pakistan player, India avoid handshake later

అండర్‌-19 ప్రపంచకప్‌లో నిన్న జరిగిన కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో భారత్‌ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లోని ప్రవేశించింది. ఈ దెబ్బతో పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించి, ఇంటిబాట పట్టింది. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీస్‌లో భారత్‌ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. 3న జరిగే తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

ఇదిలా ఉంటే, నిన్నటి భారత్‌-పాక్‌ మ్యాచ్‌​​కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇందులో భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ పాక్‌ ఆటగాడు అలీ బలోచ్‌పై ఊగిపోతూ కనిపించాడు. 

పాక్‌ ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌లో విహాన్ మల్హోత్రా బలోచ్‌ను ఔట్ చేసిన తర్వాత సూర్యవంశీ అతనిపైకి దూసుకెళ్లాడు. విహాన్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆ సమయంలో వైభవ్‌ ఉగ్రం చూస్తే పాక్‌ ప్లేయర్‌ బుర్ర బద్దలు కొట్టేలా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

మరోసారి
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి జరిగిన ప్రతి క్రికెట్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. తాజా మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌ అయిపోగానే ఎవరి దారిన వాళ్లు పెవిలియన్‌ వైపు వెళ్లారు.

నిన్నటి మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళితే... తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్‌ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్‌ పటేల్‌ (9.2-1-35-3), ఆయుశ్‌ మాత్రే (8-0-21-3), కనిష్క్‌ చౌహాన్‌ (10-1-30-1), విహాన్‌ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్‌ (5-0-26-1), హెనిల్‌ పటేల్‌ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్‌ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.

పాక్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖాన్‌ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్‌ (42), ‍కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసఫ్‌ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement