కుర్రాళ్లు కుమ్మేశారు.. అమెరికాపై భారత్‌ ఘన విజయం | T20 World Cup warm-up: India A beat USA by 38 runs | Sakshi
Sakshi News home page

T20 WC 2026: కుర్రాళ్లు కుమ్మేశారు.. అమెరికాపై భారత్‌ ఘన విజయం

Feb 2 2026 8:59 PM | Updated on Feb 2 2026 8:59 PM

T20 World Cup warm-up: India A beat USA by 38 runs

టీ20 వరల్డ్‌కప్‌-2026 వార్మప్ మ్యాచ్‌లు సోమవారం నుంచి షురూ అయ్యాయి. ఈ క్రమంలో అమెరికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో  ఇండియా ‘ఏ’ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఓపెనర్ నారాయణ్ జగదీశన్(55 బంతుల్లో 104: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ అయుష్ బదోని( 26 బంతుల్లో 60 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ 24 బంతుల్లో 38 పరుగులు చేసి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్‌, శుభమ్‌, జస్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య చేధనలో అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజయ్ కృష్ణమూర్తి (41),శుభమ్ (28), హర్మీత్ సింగ్ (25), మహ్మద్ మోసిన్ (21) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఖలీల్ అహ్మద్, తిలక్ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఫిబ్రవరి 4న సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా  సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. తిలక్ వర్మ మంగళవారం సీనియర్ జట్టుతో కలవనున్నాడు.
చదవండి: T20 WC 2026: భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కట్‌.. పాకిస్తాన్‌ మరో కొత్త డ్రామా
 

Advertisement
 
Advertisement
Advertisement